యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుంది : పొన్నం ప్రభాకర్

యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుంది : పొన్నం ప్రభాకర్

తెలంగాణ వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనుకున్నాం.. కానీ ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఉద్యోగ ఖాళీలు ప్రకటించమంటే ప్రభుత్వం స్పందించడం లేదని..దీనిపై నిరసన తెలుపడం కోసం మే 8వ తేదీ సోమవారం సరూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 6వ తేదీ శనివారం ఆయన హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సోమవారం ప్రియాంక గాంధీ హాజరయ్యే సభకు యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు పొన్నం ప్రభకర్. యువతకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఎప్పుడు అండగా ఉంటుందన్నారాయన.

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు పొన్నం. ధాన్యం ఇంకా కొనుగోలు చేయకపోవడం వల్లనే రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్దారు. తడిసిన ధాన్యం కొంటామనీ సీఎం చెబుతుంటే..తడిసిన ధాన్యం కొనమని మంత్రి చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనుగోలు చేయకుండ రైతుల బతుకులతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.  రైతులు ఏడుస్తుంటే ఢిల్లీలో కార్యాలయం ఓపెనింగ్ పేరుతో బీఆర్ఎస్ నేతలు పండగ చేసుకోవడానికి సిగ్గు లేదా అని విమర్శించారు. రైతుల ఇబ్బందులపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ము మంత్రి గంగులకు ఉందా అని సవాల్ చేశారు పొన్నం. నిరుద్యోగుల, రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లడుతుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.