ఆర్‌‌ఎస్‌‌ఎస్ మహిళలను అణిచివేస్తోంది: రాహుల్ గాంధీ

ఆర్‌‌ఎస్‌‌ఎస్ మహిళలను అణిచివేస్తోంది: రాహుల్ గాంధీ

జైపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​(ఆర్‌‌ఎస్‌‌ఎస్) మహిళలను అణిచివేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే ఆ సంస్థలో మహిళా సభ్యులు లేరని అన్నారు. భయాన్ని, విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని అని ఆయన కామెంట్ చేశారు. ద్వేషానికి వ్యతిరేకంగా నిలబడటమే తన పాదయాత్ర ఉద్దేశమని చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్​లో కొనసాగుతోంది. శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకోనుంది.

గురువారం దౌసా జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌లో మహిళ కనిపించదు. ఆ సంస్థలోకి ఆడవాళ్లను రానివ్వరు. మహిళలను అవమానించడమే వాళ్ల పని”అని రాహుల్ మండిపడ్డారు. దేశాన్ని విభజించి ద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేయడానికే ఆర్ఎస్ఎస్, బీజేపీ పని చేస్తున్నాయన్నారు. దేశంలోని వంద మంది ధనవంతుల చేతుల్లో ఉన్న సంపద వంద కోట్ల మంది ప్రజల సంపదకు సమానమని అన్నారు. బీజేపీ సర్కారు ఆ వంద మందికోసమే పనిచేస్తోందన్నారు.