
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభమైంది. సాయంత్రం 4.30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారిలో ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్.. జాతీయ జెండాను రాహుల్‌గాంధీకి అందజే యడంతో యాత్ర మొదలైంది. అంతకుముందు శ్రీపెరంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ స్మారక స్థలాన్ని రాహుల్ సందర్శించారు. యాత్రలో భాగంగా గురువారం నుంచి రాహుల్ గాంధీ రోజుకు సగటున 25 కిలోమీటర్లు నడవనున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌దాకా 150 రోజులపాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ మొత్తం 3,570 కిలోమీటర్లు యాత్ర కొనసాగించనున్నారు.
కన్యాకుమారి: దేశంలోని ప్రజలందరినీ సంఘటితం చేసి విద్వేష రాజకీయాలను ఓడించడానికే భారత్ జోడో యాత్రను చేపట్టామని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. విభజన రాజకీయాల వల్ల అప్పట్లో తన తండ్రిని కోల్పోయానని.. కానీ ఇప్పుడు దేశాన్ని కోల్పోలేనని చెప్పారు. బుధవారం కన్యాకుమారిలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో కలిసి ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. జాతీయ జెండా కేవలం మూడు రంగులు కాదని.. ప్రతి భారతీయుడి స్వేచ్ఛకు అది ప్రతీక అన్నారు. అన్ని రాష్ట్రాల సమైక్యతకు జాతీయ జెండా చిహ్నమని చెప్పారు. యాత్ర ప్రారంభోత్సవంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్, కాంగ్రెస్ నేతలు చిదంబరం, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీపెరంబుదూర్‌లోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక స్థలాన్ని రాహుల్ సందర్శించారు. అక్కడ ఒక మొక్కను నాటిన తర్వాత రాజీవ్ ఫొటో వద్ద నివాళి అర్పించారు. ఆ తర్వాత కామరాజ్ మెమోరియల్‌ను సందర్శించారు. ఆపై మహాత్మాగాంధీ మండపం వద్ద ప్రార్థనలో పాల్గొని యాత్రను లాంఛనంగా ప్రారంభించారు.
150 రోజులు.. 3,570 కిలోమీటర్లు
భారత్ జోడో యాత్రలో భాగంగా గురువారం ఉదయం 7 గంటల నుంచి రాహుల్ గాంధీ నడకను మొదలుపెడ్తారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ మొత్తం 3,570 కిలోమీటర్లు యాత్ర కొనసాగిస్తారు.
ఇదొక మైలురాయి: సోనియాగాంధీ
కాంగ్రెస్ పార్టీకి భారత్ జోడో యాత్ర ఒక మైలురాయి అని ఆ పార్టీ చీఫ్ సోనియా అభివర్ణించారు. పార్టీని తిరిగి గాడిలో పెడుతుందని పేర్కొన్నారు. సోనియా హెల్త్ కండిషన్ దృష్ట్యా యాత్ర ప్రారంభ కార్యక్రమానికి ఆమె హాజరు కాలేకపోయారు. ఈ మేరకు ఓ మెస్సేజ్‌ను పంపించారు.
ద్వేషానికి అనుమతిస్తే అంతర్యుద్ధం: గెహ్లాట్
కులం, మతంపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి అనుమతిస్తే దేశం అంతర్యుద్ధంలో కూరుకుపోతుందని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.
గాంధీ కుటుంబం కోసమే యాత్ర: బీజేపీ
గాంధీల కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపట్టిందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను గాంధీ కుటుంబ పార్టీగా ఉంచుకునేందుకు చేపట్టిన ప్రయత్నమే ఈ యాత్ర అని విమర్శించారు. ‘‘రాహుల్ తన సొంత పార్టీని ఏకం చేయలేకపోయాడు, ఆయన తరచూ ఫారిన్ లో ఉంటాడు. అయినా సరే ఆయననే మళ్లీ పార్టీ చీఫ్ గా చేయాలని చెప్పే కోరస్ బ్యాచ్ ఒకటి ఉంటది. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించాలన వంతపాడుతది. ఇది దేశాన్ని ఏకం చేసేందుకు కాదు, రాహుల్‌ను మళ్లీ పార్టీ లీడర్‌గా నిలబెట్టే ప్రయత్నం”అని రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. ఈ యాత్ర శతాబ్దపు కామెడీ అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా చేశారు.
‘‘ద్వేషం, విభజన రాజకీయాల కారణంగా నేను నా తండ్రిని కోల్పోయాను. ఇప్పుడు నా దేశాన్ని కూడా కోల్పోవాలని అనుకోవడం లేదు. ప్రేమ.. ద్వేషాన్ని జయిస్తుంది. ఆశ భయాన్ని ఓడిస్తుంది. మనమంతా కలిసి ఉంటే విభజన, ద్వేష రాజకీయాలను జయిస్తాం” - రాహుల్ గాంధీ