ముగిసిన జోడో యాత్ర

ముగిసిన జోడో యాత్ర

4 వేల కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ​
ఇయ్యాల శ్రీనగర్​లో సభ

శ్రీనగర్​ : కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ చేపట్టిన  భారత్​ జోడోయాత్ర సోమవారం కాశ్మీర్​లో ముగియనుంది. ఇవాళ శ్రీనగర్​లోని ఎస్​కే స్టేడియంలో నిర్వహించనున్న ముగింపు సభకు 23 ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించారు. ఇక ఆదివారం ఉదయం రాహుల్​ గాంధీ శ్రీనగర్​ శివారులోని పంథా చౌక్​ నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి లాల్​ చౌక్​ కు వెళ్లి చారిత్రక క్లాక్​ టవర్​ వద్ద మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రియాంకా గాంధీ, పలువురు స్థానిక కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్​ ట్వీట్​ చేస్తూ.. “లాల్​ చౌక్​ లో మువ్వన్నెల జెండాను ఎగురవేయడం ద్వారా  నేను దేశానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. విద్వేషం వీగిపోతుంది.. ప్రేమే జయిస్తుంది.. భారతావనికి కొత్త ఆశల మహోదయం ముందుంది ” అని పేర్కొన్నారు. కాగా, రాహుల్​ గాంధీ అలుపెరుగని పాదయాత్ర వల్ల దేశం నలుమూలలా ప్రేమ సందేశం వ్యాపించిందని ప్రియాంకా గాంధీ అన్నారు.

కిందటేడాది సెప్టెంబర్​ 7న మొదలు..

భారత్​ జోడో యాత్రను కిందటేడాది సెప్టెంబర్​ 7న కన్యాకుమారిలో రాహుల్​ ప్రారంభించారు.కన్యాకుమారి నుంచి కాశ్మీర్​ దాకా చేపట్టిన ఈ యాత్రలో భాగంగా తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా రాహుల్​ గాంధీ నడిచారు. మొత్తం 145 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో రాహుల్​ గాంధీ 3,970 కిలోమీటర్లు నడిచారు.