న్యూఢిల్లీ, వెలుగు: వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేలా సహకరించకుండా బీఆర్ఎస్ మాయ మాటలతో మోసం చేస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ రెండు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర సామజిక న్యాయశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో కలిపే అంశంపై చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని బీఆర్ఎస్ సర్కార్ కేంద్రానికి పంపలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ను త్వరలో ప్రకటిస్తామన్నారు. వాల్మీకి, బోయలను గిరిజనుల జాబితాలో చేర్చే అంశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చుతామని సంపత్ పేర్కొన్నారు.

