‘కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తాం’

‘కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తాం’

గాంధీభవన్ లో శనివారం ఉదయం కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలు చర్చించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, రాష్ట్ర ఛైర్మెన్ అన్వేష్ రెడ్డి, పలువురు డీసీసీ లు…ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ…  పంటరుణాల మాఫీ పై  టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి  స్పష్టత ఇవ్వలేదన్నారు. రైతుభీమా-రైతుబంధు పథకాలు రైతులందరికీ అందడం లేదన్నారు. రైతుబంధు పథకం 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే అందుతున్నట్లు తెలుస్తుందని ఆయన చెప్పారు. ఏ ప్రభుత్వం అయినా రైతుల కోసం పథకాలు తెస్తే ఎవ్వరూ అడ్డుచెప్పడం లేదని, రైతుబంధు ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ వర్తింపజేయాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు 6వేల మంది రైతులు మరణించారని, మరణించిన రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం వెంటనే అందజేయాలని ఆయన అన్నారు. కందిరైతులను ప్రభుత్వం అదుకొని అన్నింటినీ కొనుగోలు చేయాలని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ .. భూమి పై ఆధారపడిన రైతులకు ఉపాధి కల్పిస్తే..టీఆరెస్ భూములను అమ్మి పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సమావేశంలో మాట్లాడుతూ.. పేదలు, ఎస్సీ-ఎస్టీ లకు భూమి ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అయిందని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలోనే చెరువుల పూడికతీత పై సర్వే చేయించారని, అప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండటం వల్ల దానికి బ్రేక్ పడిందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం కేవలం ప్రచారమేనని, ఒక్క చెరువులో కూడా తట్టెడు మట్టి తీయలేదని ఆయన అన్నారు.  కాళేశ్వరం డ్యామ్ ఎప్పుడు నింపుతారో ఎవ్వరికి తెలియదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పట్ల పోరాటం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని, వచ్చే అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ రైతుపక్షాన పోరాటం చేస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు జగ్గారెడ్డి.

పార్టీ సీనియర్ నేత కాంగ్రెస్ కోదండ రెడ్డి ఈ సమావేశంలో మాట్లాడుతూ.. రెవెన్యూ చట్టం వచ్చే శాసనసభలో ప్రవేశపెట్టాలని, కొత్త రెవెన్యూ చట్టం తెస్తే తామూ సహకరిస్తామని చెప్పారు. కాగా సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, వీరయ్య, సీతక్క, రాజగోపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గైర్హాజరయ్యారు.

congress-leaders-held-a-meeting-in-gandhi-bhavan