
కర్ణాటక సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం పీఠం కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరికి పట్టం కట్టాలనే అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలో పడింది. ఈ క్రమంలో ఢిల్లీ్కి వెళ్లిన ఇద్దరు నేతలూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వారితో చర్చించిన ఖర్గే..అనంతరం సోనియా, రాహుల్ గాంధీతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో సీఎం ఎవరనే నిర్ణయం బుధవారం వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే, సీఎం పేరును బెంగళూరులోనే ప్రకటించే అవకాశం ఉంది.
ఖర్గే ముందు సిద్ధరామయ్య కీలక ప్రతిపాదనలు
మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయిన సిద్ధరామయ్య ఆయన ముందు పలు ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం పదవిని రెండున్నర ఏళ్లు విభజిస్తే తొలుత సీఎం పదవిని తనకే ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇవే తనకు చివరి ఎన్నికలని, మెజార్టీ ఎమ్మెల్యేలు సైతం తానే సీఎం కావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. ఎమ్మెల్యేల నిర్ణయాన్ని అధిష్టానం గౌరవించాలని సిద్ధరామయ్య కోరినట్లు సమాచారం
రాహుల్ మద్దుతు కూడా సిద్ధరామయ్యకే.. !
సీఎం ఎంపిక విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సహా కర్ణాటక నుంచి కొందరు కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యేలు, నేతలు కూడా పాల్గొన్నారు. సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే బాగుంటుందని రాహుల్, కేసీ వేణుగోపాల్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.
136 సీట్లతో అధికారం
మే 10న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 136 స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. గత ఎన్నికల్లో 80 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి అదనంగా మరో 56 స్థానాలను గెలుచుకుంది. సిద్ధరామయ్య, శివకుమార్ ల ధ్వయం, కృషి, రాహుల్ జోడో యాత్ర ప్రభావం, ప్రియాంకగాంధీ ప్రచారం ఈ పార్టీ విజయానికి కారణాలు అయ్యాయి.