- వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం: మీనాక్షీ నటరాజన్
- గ్రామ, వార్డు సభలు చాలా కీలకమన్న పీసీసీ చీఫ్
- ‘సర్’పై కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: సర్ ప్రక్రియలో అనామలీస్, అన్‌మ్యాప్డ్ ఓట్లను జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన ఒక్క ఓటు కూడా ఓటర్ లిస్టు నుంచి పోకుండా చూడాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ పార్టీ నేతలకు సూచించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. సర్‌లో లక్షలాది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని, దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందన్నారు. సోమవారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సర్‌పై పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్‌తో కలిసి మీనాక్షీ నటరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్క ఓటు తొలగిపోయినా పార్టీకి నష్టం తప్పదన్నారు. ప్రతి నాయకుడు సీరియస్‌గా వ్యవహరించి ప్రతి ఓటును కాపాడుకోవాలని సూచించారు. అనామలీస్, అన్‌మ్యాప్డ్ ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె కోరారు. ఓట్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా లేకపోతే రాజకీయంగా నష్టపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. .
గ్రామ సభలపై ఫోకస్..
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27న ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సభలు జరగనున్నాయని తెలిపారు. ఈ సభలు కాంగ్రెస్‌కు చాలా కీలకమన్నారు. చిన్న నిర్లక్ష్యం జరిగినా పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఎల్‌ఏలు తమ వద్ద ఉన్న ఓటర్ల డేటాతో గ్రామ, వార్డు సభలకు హాజరై ప్రతి ఓటును పరిశీలించాలని సూచించారు.
కమిటీల ఏర్పాటుపైనా ఆదేశాలు
రాష్ట్రంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌పై నిర్లక్ష్యం చేస్తే పార్టీ నష్టపోయే అవకాశం ఉందని మహేశ్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఓటును పరిశీలించి ఒక్క ఓటు కూడా నష్టపోకుండా చూసుకోవడం పార్టీ నాయకుల బాధ్యత అన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ మండల కమిటీలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పీసీసీ చీఫ్ ఆదేశించారు. సహకార సంఘాల కమిటీల ఏర్పాటును కూడా వెంటనే పూర్తి చేయాలని పార్టీ నేతలకు సూచించారు.
