ఏటా 3 సిలిండర్లు ఫ్రీ.. మహిళలు, ట్రాన్స్‎జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ: సీఎం విజయ్

ఏటా 3 సిలిండర్లు ఫ్రీ.. మహిళలు, ట్రాన్స్‎జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ: సీఎం విజయ్

చెన్నై: రాష్ట్రంలోని పేద కుటుంబాలపై వంట గ్యాస్ భారం తగ్గించేందుకు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామని తమిళనాడు సీఎం జోసెఫ్​ విజయ్​ పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం అసెంబ్లీలో సీఎం విజయ్ పలు కీలక పథకాలను ప్రకటించారు. అర్హులైన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లతో పాటు మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు.

ఈ పథకం కింద లబ్ధిదారులు సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత, దానికి సంబంధించిన నగదును నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో (డీబీటీ పద్ధతిలో) ప్రభుత్వం జమ చేస్తుంది. మహిళలకు ప్రస్తుతం ఉన్న సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని మరింత విస్తరించి ‘వెట్రి పయనం’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఈ పథకంతో మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాల్లో నడిచే ఎక్స్‌ప్రెస్, ఎల్ఎస్ఎస్, డీలక్స్ ప్రభుత్వ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణానించవచ్చు.

అలాగే, జిల్లాల మధ్య నడిచే సాధారణ, కొండ ప్రాంత బస్సుల్లోనూ ఈ సదుపాయం వర్తిస్తుంది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి ఈ విస్తరించిన బస్సు పథకం అమల్లోకి రానుంది. గత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఉచిత విద్యుత్, మహిళా ఆర్థిక సాయం, కుటుంబ ఆరోగ్య బీమాలాంటి హామీల దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా విజయ్‌ స్పష్టం చేశారు.

పరందూరు ఎయిర్ పోర్ట్ రద్దు..

చెన్నై సమీపంలోని పరందూరు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రతిపాదిత ప్రాజెక్టును తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. రైతు ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని సీఎం విజయ్ స్పష్టం చేశారు. పరందూర్ సహా పరిసర 13 గ్రామాల ప్రజల జీవనోపాధిని, సారవంతమైన వ్యవసాయ భూములను కాపాడే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్టు రూల్ 110 కింద ప్రకటించారు.

అయితే, ఈ ప్రకటనపై అసెంబ్లీలో చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో డీఎంకే ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో అధికార తమిళగ వెట్రి కజగం(టీవీకే), ప్రతిపక్ష డీఎంకేల మధ్య రాజకీయ రగడ తీవ్ర స్థాయికి చేరింది. ప్రాజెక్టు రద్దు నిర్ణయం రాష్ట్ర ప్రగతికి ‘కోలుకోలేని ఎదురుదెబ్బ’ అని ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఫైర్‌‌ అయ్యారు.