- బీజేపీ నేతలపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: ‘‘ఫీజు బకాయి.. బీజేపీ లడాయి’’ అంటూ ఆ పార్టీ బడాయికి పోతోందని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పైన రామచందర్ రావు నిరాహార దీక్ష చేస్తూ... హడావుడి చేస్తున్నడు. గత ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టింది.. మరి గత పదేండ్లలో బీజేపీ నేతలు ఎందుకు నిరాహార దీక్షలు చేయలేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.
అప్పుడు కేసీఆర్‌పై పోరాటాలు చేయలేని వారు, కేసీఆర్ పెట్టిన బకాయిల గురించి మాట్లాడని వారు.. ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజం గమనిస్తుందని అన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడమే బీజేపీ విధానంగా కనిపిస్తుందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో మా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు పోతోందన్నారు. ప్రతి ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 2,300 కోట్ల రూపాయల అవసరం ఉందని, ఈ విద్యా సంవత్సరం నుంచి గ్రీన్ చానెల్‌లో ఈ డబ్బులు విద్యార్థుల ఖాతాల్లో నేరుగా వేయనున్నామని చెప్పారు. ఇప్పటికే 300 కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా బ్యాంక్ లో సిద్ధం చేసి ఉంచామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని హైకోర్టుకు కూడా వివరించామన్నారు.
బీజేపీకి నైతిక అర్హత లేదు: బల్మూరి
బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ‘ఫీజు బకాయి.. బీజేపీ లడాయి’ పేరుతో 48 గంటల దీక్ష చేస్తుండడంపై విప్ బల్మూరి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత బీజేపీకి ఎక్కడిదని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ అయి అనేక మంది విద్యార్థులు చనిపోతే అప్పుడు మీ లడాయి ఎక్కడికి పోయిందని ఫైర్ అయ్యారు. దేశంలో న్యాయం కోసం జెన్‌జీ లడాయి చేస్తుంటే లాఠీచార్జ్ చేయించింది మీరు కాదా..అని మండిపడ్డారు.
ఐఐఎం కోసం దీక్షలు చేయాలి: చనగాని
రాష్ట్ర బీజేపీ నేతలకు తెలంగాణ విద్యార్థులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. తెలంగాణలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఐఐఎం ఏర్పాటు కోసం దీక్ష చేయాలని రాంచందర్ రావుకు పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ సూచించారు. గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ 12 ఏండ్ల పాలనలో 60సార్లు వివిధ పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నతమైన విద్యను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు రాజకీయ దురుద్దేశంతోనే దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.
