పాలిటెక్నిక్‌‌ ఆధునికీకరణపై హై లెవల్‌‌ కమిటీ..కేకే అధ్యక్షతన ఆరుగురితో కమిటీ

పాలిటెక్నిక్‌‌ ఆధునికీకరణపై హై లెవల్‌‌ కమిటీ..కేకే అధ్యక్షతన ఆరుగురితో కమిటీ
  •     ఈసెట్‌‌, ఫీజులు, ఉద్యోగుల సర్వీస్‌‌ సమస్యలపై అధ్యయనం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో పాలిటెక్నిక్‌‌ విద్యా వ్యవస్థను ఆధునికీకరించడంతోపాటు విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైలెవల్​ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు కే. కేశవరావు (కేకే) చైర్మన్‌‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో ఆరుగురికి చోటు కల్పించింది. ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌‌ కోదండరాం, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌‌ శాంతా సిన్హా, ఎనర్జీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌‌ మిట్టల్‌‌ ఐఏఎస్‌‌, శక్తి శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌‌ మెంబర్‌‌ కన్వీనర్‌‌గా వ్యవహరించనున్నారు. కమిటీ పాలిటెక్నిక్‌‌ విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరపనుంది. 

30 రోజుల్లోగా నివేదిక..

ఈసెట్‌‌ ప్రవేశాలు, ఇంజినీరింగ్‌‌ లాటరల్‌‌ ఎంట్రీ అవకాశాలు, ఫీజుల నియంత్రణ, పాలిటెక్నిక్‌‌ సంస్థల స్వయంప్రతిపత్తి, సాంకేతిక విద్యా మండలి పాత్ర, ఉద్యోగుల సర్వీస్‌‌ నిబంధనలు తదితర అంశాలను కమిటీ పరిశీలించనుంది. నెల రోజుల్లోగా సమగ్ర నివేదికతోపాటు స్పష్టమైన సిఫార్సులు ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించింది. విలీనం వల్ల డిప్లొమా విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అకడమిక్‌‌ ప్రగతి దెబ్బతినే అవకాశం ఉందని విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు ఆందోళన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి, విద్యార్థుల భవిష్యత్‌‌ ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.