రాజగోపాల్ రెడ్డిపై తక్షణం చర్యలు

రాజగోపాల్ రెడ్డిపై తక్షణం చర్యలు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి రాష్ట్ర కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. పార్టీ గీత దాటి మాట్లాడినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరాదో 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇటీవల షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి మరింత రెచ్చిపోయి విమర్శలు చేశారు. షోకాజ్ ఇవ్వాల్సింది తనకు కాదని, ప్రజలే కాంగ్రెస్ కు షోకాజ్ ఇస్తారని మండిపడ్డారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రెండోసారి అత్యవసరంగా సమావేశమైన పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. కోమటిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకమాండ్ కు లేఖ రాసింది. ఆయనను ఏమాత్రం ఉపేక్షించవద్దని అందులో కోరింది.

సస్పెండా, బహిష్కరణా..

రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా, లేక బహిష్కరించడమా అనే నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలని హైకమాండ్ కు రాసిన లేఖలో పీసీసీ కమిటీ పేర్కొంది. ఆయనపై చర్యలు తీసుకోవడంలో ఉపేక్షిస్తే పార్టీ నేతలకు క్రమశిక్షణ అంటే చులకనైపోయే ప్రమాదం ఉందని వివరించింది. పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా సరే వేటు వేస్తేనే క్రమశిక్షణ ఉంటుందని, ఇప్పటికే కాంగ్రెస్​లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువై నేతలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పింది. తెగే వరకు లాగుదామనే రీతిలో కోమటిరెడ్డి ఉన్నారని, ఆయనకు ఆ అవకాశం ఇవ్వకుండా పీసీసీయే ఆయన్ను సస్పెండ్, లేదంటే బహిష్కరణ చేసేలా అనుమతి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరింది.

రెండు మూడు రోజుల్లో నిర్ణయం…

ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్.. రాజగోపాల్ రెడ్డి విషయంలో అధిష్టానంపై ఒత్తిడి చేయవచ్చని పీసీసీ నేత ఒక్కరు చెప్పారు. రాజగోపాల్ రెడ్డిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం వచ్చే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు అంటున్నాయి. కర్నాటకలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోషన్ బేగ్ ను సస్పెండ్ చేసిన హైకమాండ్.. పార్టీలో ఏస్థాయి వారైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని హెచ్చరించింది. కోమటిరెడ్డిపైనా అధిష్టానం కఠినంగానే వ్యవహారించే అవకాశం ఉందని చర్చ సాగుతోంది.