ప్రతిపక్షాలపై ఈడీ దాడులు

ప్రతిపక్షాలపై ఈడీ దాడులు

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం  ప్రజా ఉద్యమాలను అణగదొక్కుతూ... ప్రతి పక్షాల గొంతు నొక్కుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సోమవారం గాంధీ భవన్ ఆయన మాట్లాడుతూ... మోడీ పీఎం అయిన తర్వాత దేశంలో రాజకీయ విలువలు తగ్గిపోయాయన్నారు. పీఎం పదవికి మోడీ మచ్చ తెచ్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పారు. ఈడీ,ఐటీ, సీబీఐ వంటి సంస్థలను ప్రయోగిస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. అవినీతికి పాల్పడ్డారంటూ  సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ దాడులు దుర్మార్గమన్నారు. డబ్బు కోసం అవినీతికి పాల్పడే ఖర్మ గాంధీ కుటుంబానికి అవసరం లేదని, ఈ దేశం కోసం గాంధీ కుటుంబం తమ ప్రాణాలనే త్యాగం చేసిందన్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని విచారణ పేరుతో గంటల కొద్దీ ప్నశ్నిస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకునేందుకు మోడీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.