10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చలేదా?: ఎంపీ చామల

10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చలేదా?: ఎంపీ చామల
  • ఫిరాయింపులపై కిషన్​రెడ్డి నీతులు చెప్తే ఎట్లా?: ఎంపీ చామల

హైదరాబాద్, వెలుగు: దేశంలో రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నది ఎవరో అందరికీ తెలుసని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పది 
రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదని.. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఇది కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఫిరాయింపులపై నీతులు మాట్లాడితే ఎలా అని ఫైర్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేని చేర్చుకొని, బీజేపీ మంత్రివర్గంలో స్థానం కల్పించారని గుర్తు చేశారు. శనివారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో నడిరోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని కిషన్ రెడ్డి అనడంపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  ‘సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కిషన్​రెడ్డి ఎలా గెలిచారో అందరికీ తెలుసు. అక్కడ బీఆర్ఎస్ చచ్చిపోయి కిషన్ రెడ్డికి అవయవ దానం చేసింది నిజం కాదా ?’ అని కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు. 

2014 లో టీడీపీ ఎమ్మెల్యే తలసానిని, 2018 లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కేసీఆర్ తన మంత్రి వర్గంలో చేర్చుకొని బీజేపీ, బీఆర్ఎస్​కు మధ్య తేడా ఏమీ లేదని నిరూపించుకున్నారని చెప్పారు. ‘బీజేపీతో చేతులు కలపడానికి కేసీఆర్ రాయబారాలు నడపడం లేదా? బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడానికి సిద్ధం కాలేదా? త్వరలోనే బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అవుతుంది’ అన్నారు. బిడ్డ బెయిల్ కోసం మోదీ కాళ్లు పట్టుకోవడానికి కేసీఆర్ కుటుంబం సిద్ధమైందన్నారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడంపై కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాహుల్​కు దమ్ముంది కాబట్టే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర పేరుతో 4 వేల కిలో మీటర్లు నడిచారని గుర్తుచేశారు. ‘బండి సంజయ్.. నీ బడాయి కబుర్లు ఆపు.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో నువ్వు చేసిన వసూళ్లు అందరికీ తెలుసు.. పాదయాత్ర పేరుతో పైసల యాత్ర చేసి పదవి పోగొట్టుకున్న నువ్వు కూడా మా రాహుల్ గురించి మాట్లాడుతావా?’ అని కిరణ్​కుమార్​రెడ్డి ఫైర్ అయ్యారు.