
హైదరాబాద్: న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య జరిగిన తీరు చాలా దారుణమని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. మానవత్వం లేని మృగాళ్లలా నడిరోడ్డుపై హత్య చేశారని, అక్రమార్కులు చెలరేగుతుండటంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులను వాదిస్తున్నారనే వామన్ దంపతులను హత్య చేశారన్నారు. కుంట శ్రీనివాస్ లేదా పుట్ట మధు ఇద్దరినే దోషులుగా చిత్రీకరించి మిగిలిన వాళ్లను వదిలేయాలని చూస్తున్నారని, వీళ్లు కేవలం పాత్రధారులు మాత్రమేనన్నారు. కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్ వంటి నేతలే దీనికి కారణమని ఆరోపించారు.
‘ప్రశ్నించిన వారిని తొక్కేయాలని, చంపేయాలని కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్ బహిరంగంగా సందేశాలు, ఆదేశాలు ఇచ్చారు. తమకు ప్రాణహాని ఉందని వామన్ రావు దంపతులు రక్షణ కల్పించాలని కోరారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. వామన్ రావు వాదిస్తున్న 15 కేసులపై సీబీఐ విచారణ జరపాలి. టీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందని స్వయంగా చెప్తున్న బీజేపీ.. ఎందుకు కేంద్రం నుంచి చర్యలు తీసుకోవట్లేదు? కేసీఆర్ అరాచకాలను కేంద్రం పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు అదేశించాలి. కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తా. ఈ హత్యను చూస్తే తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నామనే భయం కలుగుతోంది’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.