దేవరయంజాల్ మొత్తం యువరాజు అనుచరుల ఆక్రమణలే

దేవరయంజాల్ మొత్తం యువరాజు అనుచరుల ఆక్రమణలే

తీగ లాగితే డొంక కదిలినట్లు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంతో మరిన్ని భూకబ్జాలు వెలుగులోకి వస్తున్నాయి. నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన భూమి కూడా కబ్జా చేసిందేనని ఈటల అనడంతో విషయం సీరియస్ అయింది. నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ ఉన్న దేవరయంజాల్ భూములను కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీ పరిశీలించింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సమక్షంలో కమిటీ దేవరయంజాల్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు స్థానికంగా ఉన్న సీతారామచంద్ర స్వామి గుడికి చెందిన భూములను కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ఆ భూకబ్జాలను మున్సిపల్ అధికారులు గుర్తిస్తే.. మున్సిపల్ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఫెయిల్యూర్ అయినట్లేనని రేవంత్ అన్నారు.

‘దేవరయంజాల్‌లోని శ్రీ సీతారామచంద్ర స్వామి గుడికి చెందిన 1521 ఎకరాల దేవుడి మాన్యాలని టీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్నారు.  భూములు ఆక్రమించిండని మాజీ మంత్రి ఈటలపై సీఎం కేసీఆర్ వేటు వేసిండు. ఆ విషయంపై విచారణ జరపడానికి సర్కార్ నలుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది. వాళ్ళు నాలుగు రోజులుగా తిరిగి.. ఇందులో 160 అక్రమ కట్టడాలను గుర్తించారు. ఈ దేవరయంజాల్ నా నియోజకవర్గ పరిధిలోనే ఉంది. దేవుడి భూములు ఎవరు ఆక్రమించినా సహించేది లేదు. విచారణ కమిటీలో ఐఏఎస్ రఘునందన్ రావు నియమించడం వెనక కుట్ర ఉంది. రఘునందన్ రావు సీఎంకు బంధువు. నమస్తేతెలంగాణ ఎండీకి ఇక్కడ భూములున్నాయి. దేవుడి భూముల్లోనే.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఇంగ్లీష్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్‌లు ఉన్నాయి. గండ్ర శ్రీనివాస్ రావు పేరు మీద కూడా భూములున్నాయి. సర్వే నెంబర్ 212 నుంచి 218 వరకు మొత్తం 84 ఎకరాలలో శ్రీనివాస్ లే అవుట్ చేసిండు.

ఆర్మీ ప్రాంతాల్లో సింగిల్ ఫ్లోర్‌కే అనుమతి ఉంటుంది. కానీ, ఇక్కడ రూల్స్‌కు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టారు. ఇందులో సీఎం పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ నిర్మాణాలకు అనుమతులు ఎవరిచ్చారు? మున్సిపల్ శాఖ ఇచ్చిందా? లేక సీఎం కేసీఆర్ ఇచ్చారా? అనేది చెప్పాలి. నిషేధిత ప్రాంతాల్లో లే అవుట్ ఎలా వచ్చింది? 657 సర్వే నెంబర్‌లో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్ రెడ్డి భార్య లక్ష్మి పేరు మీద భూములున్నాయి. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు మీద కూడా భూములు ఉన్నాయి. ఆశన్న గారి జీవన్ రెడ్డి కూడా ఈ ఆక్రమణల్లో ఇన్వాల్ అయ్యారు. మంత్రి మల్లారెడ్డి ఇక్కడికి రా.. అరగంట సేపు ఇక్కడే ఉంటా. మంత్రి మల్లారెడ్డికి తెల్వకుండా భూ ఆక్రమణలు జరగలేదు.

టీఆర్ఎస్ నేతలే శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యం భూములు ఆగం జేసిండ్రు. తెలంగాణ సమాజానికి మీ దోపిడిని చూపిస్తున్నా. దేవరయంజాల్  హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తది. ఇక్కడి 160 కట్టడాలు అక్రమమని అధికారులు నిర్దారించారంటే.. మున్సిపల్ శాఖ ఫెయిల్యూర్ అయినట్లే. అంటే ఆ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఫెయిల్యూర్ అయినట్లే. ఇన్ని అక్రమ కట్టడాలు దేవరయంజాల్‌లోనే ఉన్నాయంటే.. హెచ్ఎండీఏ పరిధిలో ఇంకెన్ని ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. కొందరు ఐఏఎస్ అధికారులు కేటీఆర్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన అక్రమాలకు అండగా నిలుస్తున్నారు. యువరాజు మిత్రులు కరోనా సమయంలోనే జన్వాడలో ఆక్రమించుకుంటున్నారు. దేవరయంజాల్‌లో పెట్టుబడిదారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు’ అని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.