రాష్ట్ర అంశాలపై కేంద్రాన్ని నిలదీద్దాం : ఏపీ జితేందర్ రెడ్డి

రాష్ట్ర అంశాలపై కేంద్రాన్ని నిలదీద్దాం : ఏపీ జితేందర్ రెడ్డి
  • జితేందర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీల సమావేశం

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ విభజన చట్టంలోని హామీలు, తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌‌‌‌లో ఉన్న అంశాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (ఎస్సార్) ఏపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలకు సూచించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌ (గురజాడ హాల్)లో జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఎంపీల కీలక సమావేశం జరిగింది. 

లోక్‌‌‌‌సభలో ప్రస్తుతం జరుగుతున్న ‘డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్’ చర్చా సందర్భంగా తెలంగాణ ప్రయోజనాల కోసం ఏయే అంశాలను లేవనెత్తాలనే దానిపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన సంస్థలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం వంటి పెండింగ్ అంశాలపై గళమెత్తాలని తీర్మానించారు. 

మాపై సస్పెన్షన్ ఎత్తివేశారు: ఎంపీ చామల

తనతో పాటు మరో ఎనిమిది మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌‌‌‌ను మంగళవారం ఎత్తివేయనున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ విషయానికి సంబంధించి లోక్‌‌‌‌సభ విప్ సురేశ్ సమాచారం ఇచ్చారని చెప్పారు. 

ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్​ ఎత్తివేత

నెల రోజులుగా లోక్‌‌‌‌సభలో కొనసాగుతున్న గందరగోళానికి తెరపడనుంది. తెలంగాణకు చెందిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌‌‌‌ను ఎత్తివేసేందుకు స్పీకర్ ఓం బిర్లా సుముఖత వ్యక్తం చేశారు. 

సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్‌‌‌‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక అంగీకారం కుదిరింది. ప్రతిపక్ష పార్టీల విజ్ఞప్తి మేరకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎంపీలపై సస్పెన్షన్‌‌‌‌ను రద్దు చేస్తూ స్పీకర్ సభలో అధికారిక ప్రకటన చేయనున్నారు.