ఇట్లయితే నడ్వది.. అందరూ ఐక్యంగా ఉంటేనే కాంగ్రెస్ కు మేలు

ఇట్లయితే నడ్వది..  అందరూ ఐక్యంగా ఉంటేనే కాంగ్రెస్ కు  మేలు
  • కాంగ్రెస్​ నేతలకు తేల్చి చెప్పిన సునీల్​ కనుగోలు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను కలుపుకుపోవాలె
  • పీఏసీ సమావేశంలో పార్టీ పరిస్థితులపై ప్రజెంటేషన్​
  • ఆగస్టు 15న ఖర్గే అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గర్జన!

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో నేతలు గొడవలు పడితే పార్టీకి తీరని నష్టమని, ఐక్యంగా ఉండి జనాల్లోకి వెళ్లాలని కాంగ్రెస్​ పార్టీ వ్యూహకర్త సునీల్​ కనుగోలు పార్టీ నేతలకు సూచించినట్టు తెలిసింది. సమన్వయంతో పనిచేయాలని చెప్పినట్టు సమాచారం. పార్టీని బలోపేతం చేసే విషయంపై ఎలా ముందుకు పోవాలన్న దానిపై ఆయన పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్​లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​ రావ్​ ఠాక్రే, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కనుగోలు.. అరగంటకుపైగా పార్టీ స్థితిగతులు, బలాబలాలపై ప్రజెంటేషన్​లో వివరించారు. ‘ఎలక్షన్​ 2023’ పేరుతో అన్ని నియోజకవర్గాల్లోని పరిస్థితులను వివరించారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఎన్నికల కోసం వంద రోజుల ప్లాన్​ను అమలు చేయాల్సిందిగా సూచించారని అంటున్నారు. ప్రస్తుతం బీసీ కార్డ్​ తెరపైకి వచ్చినందున.. అన్ని సామాజిక వర్గాల వారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందిగా ఆయన తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను కలుపుకుని పోవాలని చెప్పినట్టు సమాచారం. ఆయా వర్గాల ప్రజలను కాంగ్రెస్​ వైపు ఆకర్షించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, పథకాలపై కసరత్తు చేయాలని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉపయోగపడేలా డిక్లరేషన్లను ప్రకటించాల్సిందిగా కనుగోలు సూచించినట్టు సమాచారం.

ఐదు అంశాలు జనాల్లోకి..

మరోవైపు ఐదు అంశాలను జనాల్లోకి బాగా తీసుకెళ్లేలా పార్టీ నేతలకు సునీల్​ కనుగోలు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. రూ.500కే గ్యాస్​ సిలిండర్​, రూ.4000 పింఛన్​, రూ.2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, పేదలకు ఇండ్లు వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే రేవంత్, భట్టి విక్రమార్క పాదయాత్రలు చేశారు. అయితే, అందులో అన్ని నియోజకవర్గాలూ కవర్​ కాలేదు. కాబట్టి, ఆయా నియోజకవర్గాలతోసహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ బస్సు యాత్ర చేపట్టేలా సునీల్​ కనుగోలు సూచనలు చేసినట్టు నేతలు చెప్తున్నారు. అందరూ కలిసి యాత్ర చేయాలని ఆయన చెప్పినట్టు తెలిసింది. చేరికలపైనా ఆయన ప్రజెంటేషన్​లో వివరించినట్టు తెలిసింది. పార్టీలో ఎవరు చేరితే బాగుంటుంది.. బలపడుతుందన్న దానిపైనా నివేదికను ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు నేతలు ఏది పడితే అది మాట్లాడకూడదని కూడా సూచించినట్టు సమాచారం. 

కొల్లాపూర్​ సభకు ప్రియాంక

ఈ నెల 30న కొల్లాపూర్​లో నిర్వహించనున్న సభపైనా పీఏసీ మీటింగ్​లో చర్చించినట్టు తెలిసింది. ఆ సభకు వచ్చేందుకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఓకే చెప్పారని పార్టీ నేతలు చెప్పారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఆకర్షించేందుకు ఓ భారీ బహిరంగ సభను కాంగ్రెస్​ ప్లాన్​ చేస్తున్నది. ఆగస్టు 15న భారీ సభను నిర్వహించేందుకు పీఏసీ మీటింగ్​లో నేతలు నిర్ణయించినట్టు సమాచారం. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఆహ్వానించాలని పార్టీ నేతలు తీర్మానించారు. దీనిపై రెండ్రోజుల్లో పార్టీ సబ్​కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు బస్సు యాత్ర తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పార్టీలోని కీలక నేత ఒకరు చెప్పారు. ఈ యాత్ర పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీ నేతృత్వంలో జరుగుతుందని తెలిపారు. బస్సు యాత్ర సెప్టెంబర్​లో మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ యాత్రపైనా ఒక సబ్​ కమిటీని పార్టీ ఏర్పాటు చేయనుంది. ఎక్కడి నుంచి ప్రారంభించాలి.. ఎన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలన్న దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ గౌడ్​, వర్కింగ్​ ప్రెసిడెంట్లు మహేశ్​ కుమార్​ గౌడ్​, అంజన్​ కుమార్​ యాదవ్​, జగ్గారెడ్డి, ఎంపీలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్​ కుమార్​, చిన్నారెడ్డి, దామోదర రాజనర్సింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్​ తదితరులు పాల్గొన్నారు.

తొమ్మిదేండ్లుగా దళితులు, బీసీలు, మైనార్టీలకు అన్యాయం మధు యాష్కీ గౌడ్​

తొమ్మిదేండ్లుగా కేసీఆర్​ సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేస్తున్నదని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీ గౌడ్​ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గర్జన సభను నిర్వహిస్తామని తెలిపారు. పీఏసీ సమావేశం అనంతరం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15న ఖర్గే అధ్యక్షతన గర్జన ఉంటుందన్నారు. ఈ నెల 30న కొల్లాపూర్​లో నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రియాంక గాంధీ వస్తున్నారని చెప్పారు. చేయూత కింద కాంగ్రెస్​ ప్రకటించిన రూ.4000 పింఛన్​ సత్ఫలితాలను ఇస్తున్నదని ఆయన చెప్పారు. వికలాంగులకు పింఛన్​ను రాష్ట్ర సర్కారు రూ.4016కు పెంచడం కాంగ్రెస్​ విజయమేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ (ముస్లిం, క్రిస్టియన్​), మహిళా డిక్లరేషన్లపై సబ్​ కమిటీ వేస్తున్నామని మాజీ మంత్రి, పీఏసీ కన్వీనర్​ షబ్బీర్​ అలీ తెలిపారు. ఈ 5 డిక్లరేషన్లపై స్కాలర్స్​, నిపుణులతో రీసెర్చ్ చేయిస్తామన్నారు. బస్సు యాత్రకు సంబంధించి అనుభవం ఉన్న నేతల ద్వారా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. మణిపూర్​లో 80 రోజుల నుంచి జరుగుతున్న దారుణాలపైనా పీఏసీ మీటింగ్​లో చర్చించామన్నారు. మణిపూర్​ ప్రభుత్వాన్ని రద్దు చేసి శాంతిని నెలకొల్పాలని పీఏసీ తీర్మానం చేసిందన్నారు.