కాంగ్రెస్ ​సర్కారును కూల్చే కుట్ర: డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు

కాంగ్రెస్ ​సర్కారును కూల్చే కుట్ర: డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు
  • కడియం, పల్లా, రాజాసింగ్​లపై డీజీపీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్​ ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్​ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్​ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్​ ప్రభుత్వం ఆరు నెలలు, ఏడాదిలోపే కూలిపోతుందని బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్​రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ.. కాంగ్రెస్​ నేతలు మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో  పీసీసీ జనరల్​సెక్రటరీలు పున్నా కైలాష్​, చారుకొండ వెంకటేశ్, చిలుక మధుసూదన్​ రెడ్డిలు కోరారు. వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు వారు గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి వంద గంటలు కూడా కాకముందే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని పున్నా కైలాష్​ ఆరోపించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రంలా బీఆర్ఎస్​ పనిచేస్తున్నదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద కుట్రలే చేస్తున్నారని చారుకొండ వెంకటేశ్​అన్నారు. కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్​రెడ్డి మీద క్రిమినల్​ కేసులు పెట్టాలన్నారు. కుటుంబ పాలనపై విరక్తి చెంది ప్రజలు కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని తెచ్చారన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారన్న నమ్మకంతో ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని మధుసూదన్​ రెడ్డి అన్నారు.

పల్లా రాజేశ్వర్​రెడ్డి అక్రమాస్తులు, ఫేక్​ యూనివర్సిటీ తతంగాలను బయట పెడతామని హెచ్చరించారు. అన్నింటి మీదా సీఎం రేవంత్​ రెడ్డి రివ్యూ చేస్తుంటే.. జైలుకు పోతామన్న భయం బీఆర్ఎస్​ నేతలకు పట్టుకుందన్నారు.