- ప్రకటనలో వెల్లడించిన కేసీ వేణుగోపాల్
- కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానం
- వచ్చే నెల 3న దేశవ్యాప్తంగా 12 స్థానాల్లో ఉప ఎన్నికలు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి రాజ్య సభ క్యాండిడేట్ గా పార్టీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన (ఎక్స్)లో వెల్లడించారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణ నుంచి సింఘ్వీ పేరును ఆమోదించినట్టు అందులో పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో కే. కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరో రెండేండ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో ఈ స్థానం ఖాళీ అయ్యింది. కొత్తగా ఎన్నికయ్యే రాజ్య సభ సభ్యులు రెండేండ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు.
కాగా, ఈ స్థానంతోపాటు దేశ వ్యాప్తంగా ఖాళీ అయిన 12 స్థానాల్లో ఉప ఎన్నికకు ఈ నెల 7 వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. బుధవారం ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆగస్టు 21వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉన్నది. అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
అలాగే.. బిహార్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27ను చివరి తేదీగా ప్రకటించారు. సెప్టెంబర్ 3వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.
