వచ్చే ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక

వచ్చే ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక

సోనియా అధ్యక్షతన ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు 5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అసమ్మతి నేతలపై సోనియా సీరియస్ అయ్యారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని నాయకులకు సోనియా సూచించారు. సెప్టెంబర్ 2022లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆ పార్టీ సీనియర్ లీడర్ అంబికా సోని తెలిపారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సభ్యులంతా కోరినట్లు ఆమె చెప్పారు. అధ్యక్షుడిగా ఉండాలా వద్దా అనే నిర్ణయాన్ని రాహుల్ గాంధీకే వదిలేశామని సీనియర్ లీడర్ మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. సమావేశంలో ఎజెండాలో ఉన్న అన్ని అంశాలపై చర్చించామని ఖర్గే తెలిపారు. పార్టీ లీడర్ల మధ్య ఎలాంటి విబేధాలు లేవని లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమారి అన్నారు. పార్టీ లీడర్ల అభిప్రాయాన్ని పరిశీలిస్తానని రాహుల్ గాంధీ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. 

వచ్చే సంవత్సరం జరిగే అధ్యక్ష ఎన్నిక వరకు తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలిగా ఉంటానన్న సోనియాగాంధీ నాయకత్వం పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్ అన్నారు. ఆమె నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. సోనియా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాహుల్, కేసీ వేణుగోపాల్, చిదంబరం, అశోక్ గెహ్లాట్‎తో పాటు మొత్తం 52 మంది పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రకారం.. వచ్చే ఏడాదే సెప్టెంబర్‎లో  కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. అప్పటి వరకు సోనియానే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు.