- వచ్చే నెల 2 వరకు అనంతగిరి హిల్స్‌లో శిక్షణ
- పాల్గొననున్న మహేశ్ గౌడ్, షర్మిల, మీనాక్షి నటరాజన్
- వికారాబాద్‌లో శిబిరాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు శనివారం నుంచి శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌లో వచ్చే నెల 2 వరకు 10 రోజుల పాటు పీసీసీ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులను జరగనున్నాయి.
శిక్షణ శిబిరాన్ని సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, వైఎస్ షర్మిల, పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, తెలంగాణ మంత్రులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 75 మంది డీసీసీ అధ్యక్షులు శిక్షణలో పాల్గోనున్నారు.
ఖర్గే, రాహుల్ వచ్చే చాన్స్!
డీసీసీ అధ్యక్షులకు జాతీయ స్థాయిలో సర్, మన్‌రేగా వంటి పలు అంశాలపై, రాష్ట్రంలోని పలు విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. శిక్షణా తరగతులు పార్టీ అంతర్గత కార్యక్రమంలో భాగమని, అందుకే కవరేజీకి మీడియాను అనుమతించడం లేదని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.
