వరంగల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా గ్రామాల్లో పనిచేయనున్నట్లు పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ డీసీసీ భవన్‍లో డీపీఏసీ (జిల్లా పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ) మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, విస్తరణ, సమగ్ర నిర్మాణం, పంచాయతీ, వార్డు కమిటీల ఏర్పాటు, మండల అధ్యక్షులకు ప్రమోషన్లు, మార్పులు, రైతుల సంక్షేమంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయానికి సొంత భవనం, భూమి కేటాయింపు అంశాలపై చర్చించారు.
కాగా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం కోసం తీసుకొచ్చిన బ్రేక్ పాస్ట్, మిడ్ డే మీల్స్ పథకం అమలుపై కమిటీ హర్షం వ్యక్తం చేసింది. గిగ్ వర్కర్ల భద్రతకు తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గిగ్ వర్కర్లపై వేధింపులకు కట్టడి మొదలు అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి భద్రత చట్టం ఎంతో మేలు చేస్తుందన్నారు.
సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, హుజురాబాద్ ఇన్చార్జి ఒడితల ప్రణవ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ దుద్దిళ్ల శ్రీను బాబు, డీసీసీ మహిళా అధ్యక్షురాలు బంక సరళ, కార్పొరేటర్ తోట వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

