- మోత్కూరులో ఎంపీ చామల వర్సెస్ ఎమ్మెల్యే మందుల
- జగిత్యాలలో జీవన్ వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్
- గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల వర్సెస్ సరిత
- కొత్తగూడెంలో భట్టి, పొంగులేటి వర్గాల పోటీ
- సర్వేల ప్రకారమే టికెట్లు ఇస్తామంటున్న హైకమాండ్
హైదరాబాద్/నెట్వర్క్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. మెజారిటీ చోట్ల స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు నడుమ వర్గ పోరు నడుస్తున్నది. ఎవరికివారు తమ అనుచరులకే టికెట్లు ఇవ్వాలని పట్టుబడ్తున్నారు. హైకమాండ్చెప్పినా వినకుండా పోటాపోటీగా నామినేషన్లు వేయించారు.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన 10 నియోజకవర్గాల్లోనూ కొత్త, పాత లీడర్ల మధ్య సమన్వయం కుదరట్లేదు. ఆయా చోట్ల అటు ఎమ్మెల్యేలు, ఇటు పార్టీ సీనియర్లు తమ అనుచరుల కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. సర్వేలు, సామాజిక సమీకరణాల ప్రకారమే టికెట్లు ఇస్తామని హైకమాండ్ చెప్తున్నా వీళ్లు మాత్రం వెనక్కి తగ్గడంలేదు.
ఇన్చార్జి మంత్రులు బుజ్జగిస్తున్నా వినిపించుకోవడం లేదు. 2,996 వార్డుల్లో ఏకంగా 10,046 నామినేషన్లు వేశారు. సగటున ఒక్కో చోట ముగ్గురి నుంచి నలుగురు కాంగ్రెస్ నుంచే బరిలో నిలిచారు. దీంతో ఈ రెబల్స్ఎక్కడ కొంపముంచుతారో అనే ఆందోళన హైకమాండ్‌లో నెలకొన్నది.
పోటాపోటీగా నామినేషన్లు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎంపీ రఘువీర్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అలకబూనారు. ఎమ్మెల్యేను కనీసం సంప్రదించకుండా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కలిసి మున్సిపాలిటీ అభ్యర్థుల జాబితా ప్రకటించారని బత్తుల ఆరోపిస్తున్నారు. తన అనుచరులకు టికెట్లు ఇవ్వడం లేదనే మనస్తాపంతో బత్తుల తన భార్య మాధవి, ఇద్దరు కొడుకులతో నామినేషన్లు వేయించి, హైకమాండ్‌కు తన నిరసన తెలిపినట్లు తెలుస్తున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు
మున్సిపాలిటీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామెల్ మధ్య అవగాహన కుదరలేదు. దీంతో అన్ని వార్డుల్లోనూ వీరి అనుచరులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. బీ ఫారాల ఎవరికి వస్తాయోననే ఉత్కంఠ కొనసాగుతున్నది.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాలు, ఆశ్వరావుపేటలో మంత్రులు పొంగులేటి, తుమ్మల వర్గాలు పోటా పోటీగా నామినేషన్లు వేశాయి. ముగ్గురు మంత్రులే కావడంతో వారి అనుచరుల్లో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఈ రెండు చోట్లా కాంగ్రెస్‌కు రెబెల్స్బెడద తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
గద్వాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ సరిత వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. సరిత వర్గానికి టికెట్లు రావనే సమాచారంతో ఆమె అనుచరులు ఇతర పార్టీలోకి వెళ్లిపోతున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం తప్పదనే ప్రచారం మొదలైంది.
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నీలం మధు ముదిరాజ్, కఠారి శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గపోరు నడుస్తున్నది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో మూడు వర్గాలయ్యాయి. ఇస్నాపూర్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో మొత్తం 100 డివిజన్లు ఉన్నాయి.
ఈ సీట్లను ఎవరికి ఎలా పంచాలో తెల్వక పార్టీ పెద్దలు తలపట్టుకుంటున్నారు. అనేక మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు అన్ని మున్సిపాలిటీల్లో డివిజన్లవారీగా ఆశావహుల లిస్టులు తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ఇప్పటికే సర్వే చేయించింది. ప్రజల్లో పలుకుబడి, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసింది.
రెండు రోజుల్లో ఈ లిస్టులను, బీఫాంలను ఆయా మున్సిపాలిటీలకు పంపిస్తామని, వాటికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని చెప్తోంది. మరోవైపు శనివారం యూఎస్ నుంచి జూమ్మీటింగ్ద్వారా సీఎం రేవంత్ కూడా ఈ మేరకు క్లారిటీ ఇవ్వడంతో వర్గపోరుకు ఇకనైనా తెరపడ్తుందో, లేదో చూడాలి.
జగిత్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. వీరిమధ్య సయోధ్య కుదుర్చేందుకు ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇరువర్గాల నుంచి పోటాపోటీ నామినేషన్లు పడ్డాయి. పార్టీ టికెట్ రాకపోతే తమ నాయకుడి ఫొటోతో రెబల్ అభ్యర్థులుగా బరిలో ఉంటామని ఓపెన్‌గా చెప్తున్నారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు మధ్య వర్గపోరు కారణంగా ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం జరిగింది. తాజాగా ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ వీరి తీరు మారలేదు.
ఇప్పటికే బీఆర్ఎస్ 20 వార్డులకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, కాంగ్రెస్ లో పరిస్థితి భిన్నంగా ఉంది. అన్ని వార్డుల్లో విశ్వప్రసాద్ రావు , శ్యామ్ నాయక్ వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇద్దరు లీడర్లు కూడా వేర్వేరు పేర్లను ప్రపోజ్ చేస్తుండటంతో హైకమాండ్ ఎటూ తేల్చలేకపోతున్నది.
