న్యూఢిల్లీ, వెలుగు: ప్రజాస్వామ్యం ముసుగులో తెలంగాణలో కాంగ్రెస్ నిరంకుశ పాలన సాగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు, ప్రశ్నిస్తే నిర్బంధాలు, నిరసన తెలిపితే లాఠీలతో కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెబుతోందని విమర్శించారు.‘ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన? ఇదేనా రాహుల్ గాంధీ పదేపదే మాట్లాడే ప్రజాస్వామ్యం?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం కిషన్ రెడ్డి ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తక్షణమే రూ.15 వేల కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే వివాదాస్పద 22-ఏ జాబితాలో చేర్చిన ప్రజల ప్రైవేటు భూములకు న్యాయం చేయాలన్నారు. ఈ డిమాండ్లపై అసెంబ్లీ వైపు శాంతియుతంగా వెళ్తోన్న బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరుగుతున్న అసహనానికి, అభద్రతకు నిదర్శనమన్నారు. పోలీసులతో ప్రజాసంక్షేమానికి సంబంధించిన ప్రశ్నలను ఆపలేరని సీఎం గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా అణచివేయాలని ప్రయత్నిస్తే.. అంతకంటే బలంగా ప్రజల గొంతుకై నిలబడతామమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
