
- గ్రౌండ్ లెవెల్లో సర్వేలు జరగట్లేదంటున్న కాంగ్రెస్ కేడర్
- కీలక నేతలతోనూ టచ్లో ఉండట్లేదన్న వాదనలు
- కర్నాటక వ్యవహారాల్లోనే సునీల్ కనుగోలు బిజీ
- మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలపైనా వ్యూహాలు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు తెలంగాణపై సరిగా ఫోకస్ పెట్టడం లేదనే అనుమానాలు ఆ పార్టీ కేడర్లో కలుగుతున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత ఆయన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం సలహాదారుగా నియమించుకుంది. పేసీఎం వంటి వినూత్న ప్రచారంతో అక్కడ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో సునీల్ కనుగోలు పాత్ర కీలకమన్న సంగతి తెలిసిందే. ఆయనే మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు. ప్రస్తుతం కర్నాటకలో ఉన్న ఆయన.. అక్కడి పనుల్లోనే బిజీబిజీగా గడిపేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను చూస్తూ ఇక్కడ పార్టీపై సరిగా దృష్టి పెట్టడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సర్వేలు జరగట్లేదా
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొంది. కర్నాటక రిజల్ట్ తో కాంగ్రెస్ రాష్ట్రంలో పట్టు పెంచుకుంది. అదే ఊపులో ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ సభలను ఏర్పాటు చేసింది. డిక్లరేషన్లను ప్రకటిస్తూ ముందుకు పోతున్నది. ఈ సమయంలో సునీల్ కనుగోలు టీమ్ వర్క్ ఎంతో కీలకమని నేతలు భావిస్తున్నారు. కానీ, గ్రౌండ్ లెవెల్లో వారు ఎలాంటి సర్వేలు చేయడం లేదని కార్యకర్తలు అంటున్నారు. బీఆర్ఎస్, సర్కారు నిర్ణయాలపై పైచేయి సాధించాలంటే క్షేత్ర స్థాయిలో బలాలు, బలహీనతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. మరోవైపు సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని పార్టీ హైకమాండ్ పదే పదే చెప్తున్నది. అయితే ఎలాంటి సర్వేలు లేకుండా అభ్యర్థుల బలాబలాలను ఎట్ల నిర్ణయిస్తారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ :రూ. 80కే కిలో టమాటా
సోషల్ మీడియాలో యాక్టివ్
సునీల్ కనుగోలు పలువురు సీనియర్లతోనూ టచ్లో ఉండడం లేదని తెలుస్తున్నది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమకు నియోజకవర్గాల్లో ప్రొగ్రెస్ రిపోర్టులు, ఇన్పుట్స్ ఇస్తే బాగుంటుందని వారంటున్నారు. కానీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆయన నేతలతో మాట్లాడలేదని సమాచారం. అయితే, సోషల్ మీడియాలో కనుగోలు టీమ్ యాక్టివ్గా ఉన్నదని, గ్రౌండ్ వర్క్ చేస్తున్నదని మరికొందరు నేతలు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు రిపోర్ట్లు కూడా వస్తున్నాయని అంటున్నారు. చత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలోనూ ఎన్నికలుండడంతో.. అక్కడి వ్యూహాల్లోనూ సునీల్ కనుగోలు తలమునకలై ఉన్నారని తెలుస్తున్నది. పార్టీకి తెలంగాణతో పాటు ఆయా రాష్ట్రాల్లోనూ విజయం సాధించడం కీలకం కావడంతో ఆయనే అన్నీ చూసుకుంటున్నారని, అందుకే ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారని అంటున్నారు.