మోదీని దించడమే కాంగ్రెస్ టార్గెట్.. కాంగ్రెస్ అసలు లక్ష్యమని ఇప్పుడు అర్థమైంది: బీజేపీ

మోదీని దించడమే కాంగ్రెస్ టార్గెట్.. కాంగ్రెస్ అసలు లక్ష్యమని ఇప్పుడు అర్థమైంది: బీజేపీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని పదవి నుంచి దించడమే కాంగ్రెస్ పార్టీ ​టార్గెట్​గా పెట్టుకుందని బీజేపీ ఆరోపించింది. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఓట్ ​చోరీకి వ్యతిరేకంగా ఆ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ వేదిక వద్ద కొంతమంది కార్యకర్తలు.. ప్రధాని మోదీని పదవి నుంచి దించడమే తమ లక్ష్యం అంటూ వివాదాస్పద నినాదాలు చేయడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ​పార్టీ అసలు లక్ష్యం ఇప్పుడు అర్థమైందని పేర్కొంది. ఓ మీడియా చానల్​లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయన పాలన ఇక ముగిసిపోతుందని నొక్కి చెప్పడం కనిపించింది. 

ఈ అంశంపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా స్పందించారు. "కాంగ్రెస్ ఎజెండా స్పష్టం. ఆ పార్టీ ఆందోళన సర్​ గురించి కాదు. ఇది సంవిధాన్​పై దాడి. సర్ ​పేరుతో వారు ప్రధాని మోదీని పదవి నుంచి దించాలనుకుంటున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఈసీఐని కూడా ఇలాగే బెదిరించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని మోదీని 150 సార్లకు పైగా దూషించింది’’ అని ఆయన పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

బీజేపీ మరో ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తమ ప్రియతమ నాయకుడిని ఈ విధంగా అగౌరవపరచడాన్ని సహించరని అన్నారు. ఈ నినాదాలు చూస్తుంటే.. కాంగ్రెస్ ఇప్పటికీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేకపోతోందని అర్థమవుతున్నదన్నారు.