ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ​అమలే లక్ష్యమంటున్న ఉద్యోగులు

ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ​అమలే లక్ష్యమంటున్న ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు గవర్నమెంట్​ఉద్యోగుల ఓట్లపై గురిపెట్టాయి. వాళ్ల డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగులు కూడా తమ ప్రధాన డిమాండ్​ అయిన ఓల్డ్​ పెన్షన్ స్కీమ్ సాధనపైనే దృష్టిపెట్టాయి. ఎలక్షన్​ షెడ్యూల్ ముందు​వరకు ప్రభుత్వం నుంచి ఓపీఎస్​పై ప్రకటన ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో వారిలో కొంత నిరాశ ఉంది. 

దీంతో వారంతా ఏ పార్టీ ఓపీఎస్​ను మేనిఫెస్టోలో పెడుతుందో ఆ పార్టీవైపు ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దాదాపు రెండున్నర లక్షల మంది వరకు ఉన్న ఉద్యోగుల ఓట్లు అన్ని పార్టీలకూ కీలకం. అందుకే వారి డిమాండ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అధికారంలోకి రాగానే సీపీఎస్​ను రద్దు చేసి ఓపీఎస్​ను అమలు చేస్తామని, ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేరుస్తామని కాంగ్రెస్​ పార్టీ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. 

ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకొనే చాన్స్ ఉన్నా.. బీఆర్​ఎస్  ఈ విషయాన్ని నాన్చింది.  ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​నివేదిక ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

రద్దు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే..

సీపీఎస్​ను రద్దు చేసే అధికారం  రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. పెన్షన్‌‌ ఫండ్‌‌ రెగ్యులేటరీ అండ్‌‌ డెవలప్ మెంట్‌‌ అథారిటీ (పీఎఫ్​ఆర్‌‌డీఏ) చట్టంలో ఈ విషయాన్ని చేర్చారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్​ఎస్​ పార్టీలకే ఓపీఎస్​ రద్దు అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. రాజస్థాన్‌‌, చత్తీస్​గఢ్‌‌, జార్ఖండ్‌‌, హిమాచల్‌‌ప్రదేశ్‌‌, పంజాబ్‌‌, కర్నాటక రాష్ట్రాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే సీపీఎస్​ను రద్దు చేశాయి. 

ఇక తమిళనాడు ఎన్​పీఎస్​ ఖాతాకు ఒక్క పైసా కూడా జమ చేయడం లేదు. మన రాష్ట్రంలో ఓపీఎస్​ కోసం ఉద్యోగులు ఏండ్లుగా పోరాటం చేస్తున్నారు. పాత, కొత్త అందరు ఉద్యోగులు కలిస్తే మొత్తం ఓపీఎస్​ కోరుకునే వాళ్ల సంఖ్య 3 లక్షలకు వరకు ఉంటుంది. ఇటీవల సీపీఎస్​ రద్దు కోసం ఉద్యోగులు మంత్రులు కేటీఆర్, హరీశ్​రావును కలిశారు. దీంతో బీఆర్ఎస్ కూడా​ మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు తెలుస్తోంది.