తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. అయితే ఓ షరతు పెట్టింది. మతత్వ శక్తులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేసింది. మద్దతు ప్రకటిస్తూ ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. విజయ్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు సంపూర్ణ మద్దతు అందించాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ,కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) నిర్ణయించినట్లు తమిళనాడు ఏఐసీసీ ఇన్‌చార్జి గిరీష్ చోడంకర్ ఓ ప్రకటనలో తెలిపారు.భారత రాజ్యాంగాన్ని విశ్వసించని ఏ మతతత్వ శక్తులనైనా ఈ కూటమికి టీవీకే దూరంగా ఉంచితేనే మా మద్దతు ఉంటుంది అని ఆ ప్రకటనలో తెలిపారు.
రాజ్యాంగ బద్దంగా లౌకిక, ప్రగతిశీల, సంక్షేమ ప్రభుత్వాన్ని కోరుకున్న తమిళనాడు ప్రజలు, యువత టీవీకే పార్టీని ఎంచుకున్నారు. తమిళ ప్రజలుఇచ్చిన తీర్పును గౌరవించడం, నిలబెట్టడం కాంగ్రెస్ పార్టీ కర్తవ్యం.. దానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు TVK కు సంపూర్ణ మద్దతును అందించాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ , కాంగ్రెస్ శాసనసభ పక్షం (CLP) నిర్ణయించాయని లేఖలో తెలిపారు.
కాంగ్రెస్‌తో పొత్తు విజయ్‌కు మద్దతుగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు చేరారు.కాంగ్రెస్ మద్దతుతో టీవీకే పార్టీ బలం 112కు చేరుతుంది. తమిళనాడులో 118 మెజారిటీ మార్కును దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
