లీడర్‌‌ పోయిండు.. క్యాడర్‌‌ పోలె : పార్టీ మారినా బదిలీ కాని ఓట్లు

లీడర్‌‌ పోయిండు.. క్యాడర్‌‌ పోలె : పార్టీ మారినా బదిలీ కాని ఓట్లు

కాంగ్రెస్‌‌ నుంచి టీఆర్‌‌ఎస్‌‌లోకి మారిన ఎమ్మెల్యేలకు షాక్‌‌  పార్టీ మారినా బదిలీ కాని ఓట్లు

వెలుగు నెట్‌‌వర్క్ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట క్యాడర్ ఎటువైపు మొగ్గు చూపింది? ఆ లీడర్​ వెంట నడిచిందా.. సొంత పార్టీ జెండాకే జైకొట్టిందా? లోక్‌‌సభ ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌కు పరాభవం జరగడం, చాలాచోట్ల మెజార్టీలు తగ్గడంతో ఇప్పుడు ఇది ఆసక్తిని రేపుతోంది. పలు నియోజకవర్గాల్లో పార్టీ ఫిరాయించిన లీడర్‌‌ను లెక్కచేయకుండా కేడర్ తమ పార్టీకే అండగా నిలిచారు. గెలిపించిన పార్టీని మోసం చేసి వేరే పార్టీలోకి జంప్‌‌ అయ్యారన్న కోపంతో వారికి గుణపాఠం చెప్పారు. అందువల్లే పలుచోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీలు లోక్‌‌సభ ఎన్నికలకు వచ్చేసరికి తగ్గిపోయాయి.

నకిరేకల్‌‌లో..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 19 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన రెండు నెలల్లోనే వీరిలో పదకొండు మంది రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్‌‌లోకి జంప్ అయ్యారు. లోక్‌‌సభ ఎన్నికల్లో వారిలో కొందరికి షాక్​తగిలింది. నల్గొండ ఉమ్మడి జిల్లాలోని నకిరేకల్‍ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‍ నుంచి టీఆర్‍ఎస్‍లోకి వెళ్లారు. ఆయన చేరికతో తమ ఓట్ల బలం రెట్టిస్తుందని ఆశించిన టీఆర్ఎస్ ఇక్కడ పల్టీ కొట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‍  నుంచి పోటీ చేసిన లింగయ్య… టీఆర్‍ఎస్‍ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై 8,259 ఓట్ల మెజారిటీతో గెలిచారు. లింగయ్యకు 93,699 ఓట్లు రాగా, వీరేశంకు 85,440 ఓట్లు వచ్చాయి. లోక్‌‌సభ ఎన్నికలకు ముందు లింగయ్య కాంగ్రెస్​కు రాజీనామా చేసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్​ తరఫున ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. కానీ ఈసారి ఆయన సెగ్మెంట్‌‌లో టీఆర్‍ఎస్‍కు 75,641 ఓట్లు రాగా, కాంగ్రెస్‍కు 86,941 ఓట్లు వచ్చాయి. లింగయ్య, వీరేశం కలిసి పని చేసినా.. అప్పటితో పోలిస్తే దాదాపు పదివేల ఓట్లు తగ్గిపోవటం విశేషం.

అసిఫాబాద్‌‌లో..

అసిఫాబాద్‌‌లో కాంగ్రెస్  నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆత్రం సక్కుకు అసెంబ్లీ ఎన్నికల్లో 65,788 ఓట్లు పడ్డాయి. గెలిచిన తర్వాత ఆయన టీఆర్ఎస్‌‌లోకి ఫిరాయించినా ఓటు బ్యాంకు మారలేదు. ఈ లోక్​సభ ఎన్నికల్లో అక్కడ పోటీ చేసిన టీఆర్​ఎస్ అభ్యర్థి గోడం నగేష్ కు ఆత్రం సెగ్మెంట్‌‌లో కేవలం 47,401 ఓట్లు పడ్డాయి. అప్పటితో పోలిస్తే దాదాపు 18 వేల ఓట్లు తగ్గాయి.

ఎల్లారెడ్డిలో..

జహీరాబాద్ ఎంపీ సీటు పరిధిలోని ఎల్లారెడ్డి సెగ్మెంట్‌‌ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జాజుల సురేందర్ తర్వాత టీఆర్​ఎస్‌‌లో చేరారు. 35 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన సురేందర్ చేరికతో అక్కడ భారీ ఓటుబ్యాంకుతో లీడ్‌‌లో ఉంటామని టీఆర్ఎస్​ అంచనా వేసింది. లోక్‌‌సభ రిజల్ట్‌‌లో ఓటర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేను లెక్కచేయలేదు. టీఆర్ఎస్​ కంటే కాంగ్రెస్ అభ్యర్థికే ​9 వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది.

ఖమ్మం జిల్లాలో..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ ఫిరాయించిన ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక ఎమ్మెల్యేలకు కూడా చేదు అనుభవం ఎదురైంది. పార్టీ మారి తమను మోసం చేశారని పోలీస్​ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన అక్కడి ఓట్లరు… లోక్‌‌సభ ఎన్నికల్లో బదులు తీర్చుకున్నారు. ఇల్లెందులో కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన బానోతు హరిప్రియ 3 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు.  పార్టీ మారిన ఎఫెక్ట్​తో తనకున్న అత్తెసరు ఆధిక్యాన్ని కూడా ఇప్పుడు కోల్పోయారు.  మహబూబాబాద్ లోక్​సభ సీటుకు పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థికి ఈ సెగ్మెంట్​లో కేవలం 203 ఓట్ల ఆధిక్యం లభించింది.

కొత్తగూడెం ఎమ్మెల్యే  వనమా వెంకటేశ్వరరావుకు అసెంబ్లీ ఎన్నికల్లో 81 వేల ఓట్లు రాగా.. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత తనకున్న ఓట్లను నష్టపోయారు. ఈ సెగ్మెంట్‌‌లో టీఆర్ఎస్​కు కేవలం 73,394 ఓట్లు పడ్డాయి. వనమా పార్టీ మారడంపై రగిలిపోయిన  కాంగ్రెస్​ కేడర్ పలుమార్లు ఆయనపై  పోలీస్​ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే వనమా టీఆర్ఎస్ లో చేరటం ఇష్టం లేని గులాబీ శ్రేణులు సైతం వ్యతిరేకంగా పని చేసినట్లు స్పష్టమవుతోంది. పినపాకలోనూ ఇదే పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రేగా కాంతారావుకు అప్పుడు 71,914 ఓట్లు రాగా.. అదే సెగ్మెంట్లో టీఆర్ఎస్ క్యాండిడేట్‌‌కు 54,444 ఓట్లు వచ్చాయి.