- జెండా ఊపి ప్రారంభించినపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- రాష్ట్రంలో బీఆర్ఎస్ శకం ముగిసినట్టేనని విమర్శ
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఎస్టీలకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రిజర్వేషన్లు అమలు చేసి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. గురువారం గాంధీ భవన్‌లో ఈ యాత్రను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలంతా ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఎల్లప్పుడూ అక్కున చేర్చుకుంది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు.
ఆనాడు ఇందిరా గాంధీ గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించకపోతే.. ప్రస్తుతం వారు ప్రజాప్రతినిధులుగా, ఉన్నత హోదాల్లో ఉండగలిగేవారా? అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఆకాంక్షకు తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కులగణన సర్వేను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. లంబాడీలు, గిరిజనుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజనులు సీఎం రేవంత్ రెడ్డిని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ‘రేవంత్ నాయక్’ అని పిలుచుకుంటున్నారని ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
అభివృద్ధిని తట్టుకోలేకనే ఆరోపణలు
తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిపోయిందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే కేటీఆర్, హరీశ్ రావు గంగిరెద్దుల్లా ఊరేగుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ, జరుగుతున్న అభివృద్ధిని వారు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్ ప్రభు త్వం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఐదు రోజుల పాటు సాగే ఈ ఆదివాసీ బస్సు యాత్ర ముగింపు సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో పాటు పలువురు ఆదివాసీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
‘సర్’ పై పరిశీలనకు అసెంబ్లీ కో ఆర్డినేటర్లు
‘సర్’పై ఎప్పటికప్పుడు పరిశీలన చేసేందుకు వీలుగా పీసీసీ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమించింది. గురువారం పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమిస్తూ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత కార్పొరేషన్ల చైర్మన్‌లు, సీనియర్ నేతలను కోఆర్డినేటర్లుగా నియమించారు. వీరు ఎప్పటికప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, బీఎల్ఏలను సమన్వయం చేసుకుంటూ సర్ ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్క ఓటును అధికారులు తొలగించకుండా నిరంతరం పర్యవేక్షించనున్నారు.
