హిమాచల్ ప్రదేశ్: కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న ప్రతిభాసింగ్ మద్దతుదారులు

హిమాచల్ ప్రదేశ్: కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న ప్రతిభాసింగ్ మద్దతుదారులు

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి సీఎం అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారింది. సీఎం రేసులో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ ప్రతిభా సింగ్ మద్దతుదారులు రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్‌ నేతల వాహనాలను అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలైన రాజీవ్‌ శుక్లా, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భాఘేల్‌, హర్యానా మాజీ సీఎం భూపిందర్‌ హుడా కొత్త సీఎం ఎంపిక కోసం సిమ్లా వెళ్లారు. వారిని అడ్డుకున్న ప్రతిభాసింగ్ మద్దతుదారులు ఆమెకు సపోర్టుగా  నినాదాలు చేశారు.

మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు పలువురు నేతలు, ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సీఎం ఎంపికపై వారి అభిప్రాయాలను సేకరించారు. సీఎం ఎంపికపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని ముగ్గురు నేతలు స్పష్టం చేశారు. తన భర్త దివంగత మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ పేరు, ఆయన పనితీరు వల్లనే కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని విస్మరించలేరని, ఆ క్రెడిట్‌ను మరొకరికి ఇవ్వడం సరికాదని అన్నారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌ విస్మరించబోదని వెల్లడించారు.

హిమాచల్​ప్రదేశ్​లో కాంగ్రెస్​ ఘన విజయం సాధించింది. ఐదేండ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని ఇక్కడి ఓటర్లు 1985 నుంచి కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఈసారి బీజేపీని కాదని కాంగ్రెస్​కు అధికారాన్ని అప్పజెప్పారు. కేవలం ఒక శాతం కంటే తక్కువ (0.7%) ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. ఆమ్​ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా కూడా తెరువలేదు. ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్​ నుంచి సీఎం రేస్​లో మాజీ సీఎం, దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్​ ముందు వరుసలో ఉన్నారు. శుక్రవారం శాసన సభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు.