కేరళలో భారీ విజయం దిశగా కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమి

 కేరళలో భారీ విజయం దిశగా కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమి

తిరువనంతపురం: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. అధికార ఎల్డీఎఫ్ కూటమి జోరుకు బ్రేకులు వేస్తూ యూడీఎఫ్ స్పష్టమైన మెజార్టీ కనబరుస్తోంది. ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం యూడీఎఫ్ 93 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార ఎల్డీఎఫ్ కూటమి 41 స్థానాల్లోనే లీడ్‎లో ఉంది. కేరళలో పాగా వేయాలని కలలు కన్న బీజేపీకి మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. 

కాషాయ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల సంఖ్య 71. యూడీఎఫ్ కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. కేరళ ఓటర్లు ప్రతి ఐదేండ్లు ఒకసారి ప్రభుత్వ మార్పు కోరుకుంటారు. ఈ సంప్రదాయాన్ని పినరయ్ విజయన్ సర్కార్ బ్రేక్ చేసింది. 

గత రెండు పర్యాయాలుగా ఎల్డీఎఫ్ కూటమి వరుసగా విజయదుందుభి మోగించారు. కానీ ఈ సారి కేరళ ఓటర్లు తమ పాత సంప్రదాయానికే మొగ్గు చూపారు. పాలన మార్పు కోరుకుంటూ యూడీఎఫ్ కూటమికి జై కొట్టారు. యూడీఎఫ్ కూటమి విజయం లాంఛనం కావడంతో కొత్త సీఎం ఎవరనే చర్చ కేరళ రాజకీయాల్లో మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీఆ వేణుగోపాల్ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు.