ధరల పెరుగుదలకు వ్య తిరేకంగా కాంగ్రెస్ మెగా ర్యాలీ

ధరల పెరుగుదలకు వ్య తిరేకంగా కాంగ్రెస్ మెగా ర్యాలీ

ఇవాళ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. ఉదయం 11 గంటల నుంచి మెహంగై పర్ హల్లా బోల్ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. తర్వాత ఛలో ఢిల్లీ పేరుతో ర్యాలీ నిర్వహించనున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ వంటి సమస్యలపై కాంగ్రెస్ నేతలు నిరసన తెలపనున్నారు.కేంద్రానికి వ్యతిరేకంగా నిర్వహించే ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో పాటు పలువురు నేతలు ప్రసంగించనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు. 

ధరల పెరుగుదలకు వ్య తిరేకంగా కాంగ్రెస్ చేపట్టే మెగా ర్యాలీని రాహుల్ ప్రారంభిస్తారని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం ఈ ర్యాలీతో ముగియబోదని స్పష్టం చేశారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరగనున్న ఈ నిరసన... దేశంలోనే అతిపెద్ద ర్యాలీలలో ఒకటిగా నిలుస్తుందన్నారు. మరోవైపు ఈనెల 7 నుంచి కాంగ్రెస్ పార్టీ ‘‘భారత్ జోడో యాత్ర’’ పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్రను ప్రారంభించనుంది.

ర్యాలీ దృష్ట్యా ఢిల్లీలోని రాంలీలా మైదానం సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.కొన్ని రోడ్లు మూసేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. ఇవాళ ఏ ఏ ప్రాంతాల్లో రోడ్లు మూసివేయనున్నారో ముందుగానే ప్రయాణికులకు సమాచారం అందించారు. ర్యాలీ జరిగే ప్రాంతాల్లో స్థానిక పోలీసులతో పాటు.. పారామిలటరీ బలగాలు మోహరించాయి. మైదానం దగ్గర ఎంట్రీ పాయింట్ల దగ్గర మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు.