క‌రోనా క‌ల్లోలం.. రానున్న నాలుగు వారాలు చాలా కీల‌కం: మోడీ

క‌రోనా క‌ల్లోలం.. రానున్న నాలుగు వారాలు చాలా కీల‌కం: మోడీ

దేశంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డిలో రానున్న మూడు నాలుగు వారాలు చాలా కీల‌క‌మ‌ని అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఈ కొద్ది కాలం జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌కుంటే ఇన్నాళ్లు లాక్ డౌన్ విధించి క‌రోనాను కంట్రోల్ చేయ‌డానికి ప‌డిన క‌ష్టం వృథా అవుతుంద‌న్నారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ ముగుస్తుండ‌డంతో శ‌నివారం అన్ని రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్ష‌ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నను ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఏప్రిల్ 14న త‌ర్వాత కూడా లాక్ డౌన్ ను మ‌రో రెండు వారాల పాటు పొడిగించాల‌ని కోరారు. దీనిపై ప్ర‌ధాని మాట్లాడుతూ లాక్ డౌన్ పొడిగింపుపై దాదాపు అంద‌రూ ఏకాభిప్రాయాన్ని వ్య‌క్తం చేశార‌ని అన్నారు. డాక్ట‌ర్లు, ఇత‌ర వైద్య సిబ్బందికి అవ‌స‌ర‌మైన పీపీఈల కొర‌త గురించి ప‌లువురు సీఎంలు ప్ర‌స్తావించ‌గా.. అవ‌స‌ర‌మైన మేర వాటిని సిద్దం చేస్తున్నామ‌ని తెలిపారు.

గ‌త స‌మావేశంలో ప్ర‌ధాని మోడీ ముందు బ‌తికుంటే చాలు అంటూ లాక్ డౌన్ ను క‌ఠినంగాపాటించాల‌ని సూచించారు. అయితే శ‌నివారం జ‌రిగిన స‌మావేశంలో ప్రాణాల‌ను కాపాడుకుంటూనే.. దేశ భ‌విష్య‌త్తును మంచి ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా పదిలంగా చూసుకోవాల‌ని అన్నారు. ఇందుకోసం ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌ను ప్ర‌జ‌లు ప‌క్కాగా పాటించాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లు ఇళ్ల‌లో ఉండి క‌రోనా వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయాల‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన నిత్యావ‌స‌రాలకు ఏమాత్రం కొర‌త లేకుండా చూస్తామ‌ని చెప్పారు మోడీ.