Air India Plane Crash: మాజీ సీఎం విజయ్ రూపాని డెడ్ బాడీ గుర్తింపు.. శరీర భాగాలతో DNA మ్యాచ్

Air India Plane Crash: మాజీ సీఎం విజయ్ రూపాని డెడ్ బాడీ గుర్తింపు.. శరీర భాగాలతో DNA  మ్యాచ్

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంతో ఫ్లైట్ ఎక్కాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఫ్లైట్ క్రాష్ లో చనిపోయిన వారి మృతదేహాలు అప్పగిస్తే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. 

గుర్తించలేని స్థితిలో మాంసపు ముద్దలుగా మారిన శరీర భాగాలను గర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఇప్పటికే డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆదివారం (జూన్ 15) డీఎన్ఏ టెస్టుల్లో మాజీ సీఎం విజయ్ రూపాని మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. రూపానీ డీఎన్ఏ శరీర భాగాలతో మ్యాచ్ అయినట్లు అధికార వర్గాల ద్వారా తెలస్తోంది. 

►ALSO READ | గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 16 మంది మృతి

విజయ్ రూపానీతో పాటు ఇప్పటి వరకు మొత్తం 32 మంది DNA మ్యాచ్ అయినట్లు వైద్యులు తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలలో ఇప్పటికే 14 మంది డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

ఎయిర్ ఇండియా  AI171 ఫ్లైట్ క్రాష్ అయిన ఘటనలో మృతుల మొత్తం 279 మందికి చేరింది. మొత్తం 242 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం టేక్ ఆఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే మెడికల్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రయాణికులతో పాటు డాక్టర్లు, మెడికోలు చనిపోయారు. మృతుల సంఖ్య మొత్తం 279కి చేరినట్లు అధికారికంగా ప్రకటించారు ఎయిర్ పోర్ట్ అధికారులు. 

గుజరాత్‏లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‎లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది.