MLC 2025: మిగిలింది ముగ్గురే: పరుగుల దాహం తీరనిది.. కోహ్లీని వెనక్కి నెట్టిన విండీస్ వీరుడు

MLC 2025: మిగిలింది ముగ్గురే: పరుగుల దాహం తీరనిది.. కోహ్లీని వెనక్కి నెట్టిన విండీస్ వీరుడు

వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పొలార్డ్ టీ20 ఫార్మాట్ లో అదరగొడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా..తన ఫామ్ ఏ మాత్రం తగ్గలేదనేది వాస్తవం. టీ20 ఫార్మాట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ఈ విండీస్ వీరుడు ఒక మైల్ స్టోన్ అందుకున్నాడు. టీ20 క్రికెట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల రికార్డును అధిగమించి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ టీ20 లీగ్ లో భాగంగా పొలార్డ్ ఈ ఘనతను అందుకున్నాడు. 

మేజర్ లీగ్ క్రికెట్ లో శనివారం (జూన్ 14) ముంబై ఇండియన్స్ న్యూయార్క్, టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కాలిఫోర్నియాలో జరిగిన ఈ మ్యాచ్ లో ఎంఐ న్యూయార్క్ తరపున ఆడుతున్న పొలార్డ్ 16 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పొలార్డ్ కోహ్లీ పరుగులను అధిగమించాడు. విరాట్ టీ20 ఫార్మాట్ లో 397 ఇన్నింగ్స్ ల్లో 13,543 పరుగులు చేశాడు. మరోవైపు పొలార్డ్ 618 ఇన్నింగ్స్ ల్లో 13,569 పరుగులతో కోహ్లీ పరుగుల రికార్డును వెనక్కి నెట్టాడు. ఈ లిస్ట్ లో వెస్టిండీస్ సిక్సులు వీరుడు క్రిస్ గేల్ (14,562) అగ్ర స్థానంలో ఉన్నాడు. అలెక్స్ హేల్స్ (13,704), షోయబ్ మాలిక్ (13,571) వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. 

పొలార్డ్ మరో 992 పరుగులు చేస్తే టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ టోర్నమెంట్ లో మరో 136 పరుగులు చేస్తే అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్ లను అధిగమించి రెండో స్థానికి చేరతాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఎంఐ న్యూయార్క్ 8 వికెట్ల నష్టానికి 182 పరుగులకే పరిమితమై 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. డారిల్ మిచెల్ చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన దశలో కేవలం 5 పరుగులే ఇచ్చి మ్యాచ్ ను గెలిపించాడు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు

14,562 - క్రిస్ గేల్ (455 ఇన్నింగ్స్‌లు)

13,704 - అలెక్స్ హేల్స్ (493 ఇన్నింగ్స్)

13,571 - షోయబ్ మాలిక్ (515 ఇన్నింగ్స్)

13,569 - కీరాన్ పొలార్డ్ (618 ఇన్నింగ్స్)

13,543 - విరాట్ కోహ్లీ (397 ఇన్నింగ్స్)