గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

డ్యూటీలో ఉండగా విషాదం

కాగజ్​నగర్, వెలుగు: గుండెపోటుతో డ్యూటీలోనే ఓ కానిస్టేబుల్​కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని పోలీస్​స్టేషన్​లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కెరమెరి మండలం దేవాపూర్​కు చెందిన రాథోడ్​ మనోజ్​కుమార్(27) 2018లో  కానిస్టేబుల్​గా ఎంపికయ్యాడు. గత ఏడాది ఏప్రిల్​నుంచి కౌటాల పోలీస్​స్టేషన్​లో డ్యూటీ చేస్తున్నాడు. ఏడాది క్రితం జీవితతో వివాహమైంది. ఎప్పటిలానే బుధవారం రాత్రి 8 గంటలకు వాచ్​డ్యూటీ కానిస్టేబుల్​గా బాధ్యతలు చేపట్టాడు. రాత్రి క్రికెట్​మ్యాచ్​ను తోటి కానిస్టేబుల్​తో కలిసి చూశాడు. అర్ధరాత్రి 12 తర్వాత డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో చనిపోయాడు.

గురువారం ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు మనోజ్​సెట్​కాన్ఫరెన్స్​అటెండ్​ చేయకపోవడంతో హెడ్​కానిస్టేబుల్​ రమేష్​ అతడిని నిద్ర లేపేందుకు ప్రయత్నించారు. అయితే నోటి నుంచి కొద్దిగా రక్తం పడి ఉండటంతో పాటు శరీరానికి చీమలు పట్టడంతో వెంటనే కౌటాల సీఐ శ్రీనివాస్​కు సమాచారం అందించారు. సీఐ వచ్చి చూసి అప్పటికే మనోజ్​కుమార్​చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని సిర్పూర్​ సామాజిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించారు.

రాత్రి డ్యూటీ లేకుంటే…

రాత్రి డ్యూటీ లేకుంటే తన భర్త ప్రాణాలు నిలిచేవని, ఇప్పుడు తన జీవితం ఎటు కాకుండా ఆగమైందని, భర్త ప్రాణాలు తెచ్చివ్వాలంటూ కానిస్టేబుల్​భార్య జీవిత సివిల్​ఆస్పత్రి వద్ద జిల్లా ఎస్పీ ఎం.మల్లారెడ్డి కాళ్లు పట్టుకొని ఏడ్చిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.  మనోజ్​కుమార్​కుటుంబానికి అన్ని విధాల శాఖపరంగా సాయం అందిస్తామని జిల్లా ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని బెనిఫిట్స్​వెంటనే ఇప్పిస్తామని, కుటుంబంలో ఒకరికి 15 రోజుల్లో జాబ్​ ఇప్పిస్తామని పేర్కొన్నారు.