కదలని కరకట్ట పనులు .. రెండేళ్లలో 2.5 కిలోమీటర్లకు 750 మీటర్లే పూర్తి

కదలని కరకట్ట పనులు .. రెండేళ్లలో 2.5 కిలోమీటర్లకు 750 మీటర్లే పూర్తి

 నిర్మాణంలో వాడుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
 వర్షాకాలానికి ముందే పనులు పూర్తయ్యేనా..?
 లేబర్​ కొరత, ఎండలను సాకుగా చూపుతున్న ఆఫీసర్లు
 వరదలొస్తే నిలిచిపోనున్న పనులు

ములుగు/ మంగపేట, వెలుగు :  ములుగు జిల్లాలోని గోదావరి కరకట్ట నిర్మాణ పనులు ఆఫీసర్ల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. ఏండ్లుగా మంగపేట పట్టణ శివారులోని భూములు గోదావరి వరదల కోతకు గురవుతున్నా, ప్రభుత్వం చేపట్టిన కరకట్ట నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చేలా ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏటా గోదావరి ఉగ్రరూపం దాల్చినప్పుడు మంగపేట మండలంలోని గంపోనిగూడెం నుంచి పొదుమూరు వరకు ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనల మధ్య కాలం వెల్లదీస్తున్నారు. స్థానిక ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని మంత్రి సీతక్క పలుమార్లు ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి కరకట్ట నిర్మాణానికి కృషి చేసినప్పటికీ పనుల్లో పురోగతి కనిపించడం లేదు.

రూ.60 కోట్లతో 2 కిలోమీటర్ల కరకట్ట.. 

మంగపేట మండలంలోని గంపోనిగూడెం నుంచి పొదుమూరు పుష్కర్​ఘాట్​ వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర గోదావరి ఒడ్డు కోతకు గురై పలువురి భూములు నదిలో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో స్థానికులు ప్రభుత్వాన్ని ఆశ్రయించగా, ఎట్టకేలకు 2025లో పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 2020– 22లోనే వర్క్​ ఆర్డర్లు జారీ కాగా, మంగపేట, ఏటూరునాగారం మండలాల పరిధిలో గోదావరి పనుల కోసం మొత్తం రూ.137 కోట్లు మంజూరు చేశారు.

ఇందులో రూ. 60 కోట్లతో 2 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం చేపట్టారు. 2025లో గుత్తేదారు పనులు ప్రారంభించి తొలిదశలో 50 మీటర్ల మేర నిర్మాణం చేపట్టగా, వర్షాలు, వరదల కారణంగా పనులు నిలిచిపోయాయి. ఈ ఏడాది మళ్లీ పనులు ప్రారంభించి ప్రస్తుతం 700 మీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. మిలిగిన పనులు వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాల్సి ఉంది. లేదంటే వరదల కారణంగా పనులు మళ్లీ నిలిచిపోయే ప్రమాదం ఉందని గోదావరి తీర ప్రాంతాల ప్రజలు ఆందోళన 
వ్యక్తం చేస్తున్నారు. 

పనుల్లో నూతన టెక్నాలజీ..

మంగపేట కరకట్ట నిర్మాణంలో తెలంగాణలో తొలిసారిగా ‘గబియన్స్​ టెక్నాలజీ’ని వినియోగిస్తున్నట్లు ఇరిగేషన్​ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు నార్త్​ ఇండియాలో మాత్రమే ఉపయోగించిన ఈ సాంకేతికతను ములుగు జిల్లాలో అమలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీలో అల్యూమినియం– జింక్​ కోటెడ్​ వైర్​ మెష్​ను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎంతటి వరద ఉధృతి వచ్చినా కరకట్ట దెబ్బతినకుండా బలంగా నిలబడుతుందని ఆఫీస్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రతిరోజూ 250 మంది కార్మికులతో పనులు కొనసాగుతున్నాయి. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో లేబర్ ను పెంచి పనుల్లో వేగం పెంచాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నది మట్టానికి 15 మీటర్ల ఎత్తులో, 2.5 ఈస్ట్​ వన్​ స్లోప్​, 70.3 లెవెల్ వన్​ బర్మ్​ పద్ధతిలో రివిట్​మెంట్ పనులు కొనసాగుతున్నాయి. 

లేబర్​ కొరతతో పనుల్లో ఆలస్యం.. 

మంగపేట సమీపంలోని గోదావరిపై కరకట్ట నిర్మాణ పనులు ఆలస్యంగా సాగుతుండగా, లేబర్​ కొతరతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆఫీసర్లు, గుత్తేదారు చెబుతున్నారు. భారీ ఎండల కారణంగా పనుల్లో జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు.

మే చివరి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించిన చేపథ్యంలో, తెలంగాణలో కూడా త్వరలోనే వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు, వరదలతో పనులు మళ్లీ నిలిచిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కరకట్ట పనులను పరిశీలించి, పనుల్లో జాప్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. 

వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేస్తాం..

రానున్న వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం 250 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. అవసరమైతే మరింత మంది లేబర్​ను పెంచి పనుల్లో వేగం పెంచాలని గుత్తేదారును ఆదేశించాం. ఎండల తీవ్రత కారణంగా కొంత ఆలస్యం జరిగింది. - వలీ మహమ్మద్, ఇరిగేషన్​ ఏఈ