ఫుడ్ అడల్ట్రేషన్ చట్టాన్ని కఠినతరం చేయాలి : వినియోగదారుల సమన్వయ సమితి

ఫుడ్ అడల్ట్రేషన్ చట్టాన్ని కఠినతరం చేయాలి : వినియోగదారుల సమన్వయ సమితి
  • నామమాత్రపు శిక్షలతో నిందితులు భయపడట్లేదు
  • వినియోగదారుల సమన్వయ సమితి డిమాండ్

పంజాగుట్ట, వెలుగు: ఆహార కల్తీని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో ఆయన మాట్లాడుతూ.. ఆహార కల్తీపై గత ముప్పై ఏండ్లుగా తాము పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లకు రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం, ఇతర పదార్థాలు సరఫరా అవుతున్నాయని, దీనివల్ల ప్రజలు తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. కల్తీ చేస్తున్న వారికి నామమాత్రపు శిక్షలు ఉండటం వల్లే వారు భయపడటం లేదని, అందుకే ఫుడ్ అడల్ట్రేషన్ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేయాలని కోరారు. సమావేశంలో సాంభరాజు చక్రపాణి, మామిడి భీంరెడ్డి, ఏ.వీ. రావు తదితరులు పాల్గొన్నారు.