సీజ్ ఫైర్ లేదు.. తొక్క లేదు.. మిస్సైల్స్తో లెబనాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ !

సీజ్ ఫైర్ లేదు.. తొక్క లేదు.. మిస్సైల్స్తో లెబనాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ !

లెబనాన్పై ఇజ్రాయెల్ మిస్సైల్ అటాక్ చేసింది. అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ ఒప్పందం పరిధిలో లెబనాన్ లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. దక్షిణ లెబనాన్‌లోని టైర్ సిటీని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలోని ఒక పెద్ద బిల్డింగ్పై మిస్సైల్స్తో విరుచుకుపడింది. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సమర్థించుకున్నారు.

దక్షిణ లెబనాన్‌లోని టైర్ సిటీలో హిజ్బుల్లా కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అందుకే ఈ దాడులు చేసినట్లు తెలిపింది. లెబనాన్పై యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. రెండు వారాల అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా.. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా బుధవారం ఉత్తర ఇజ్రాయెల్‌ పైనా, లెబనాన్‌లోని ఇజ్రాయెల్ సైనికుల పైనా దాడులను నిలిపివేసింది. అయితే.. ఇజ్రాయెల్ కూడా ఈ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని.. లేకపోతే ప్రతిదాడులు తప్పవని హిజ్బుల్లా హెచ్చరించింది.

►ALSO READ | ఇరాన్‌తో ఒప్పందానికి సిద్ధమైన ట్రంప్.. ఆంక్షల సడలింపుపై కీలక ప్రకటన..

హిజ్బుల్లా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ బుధవారం కూడా దాడులను కొనసాగించింది. "లెబనాన్‌లో యుద్ధం కొనసాగుతోంది, కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌కు చోటు లేదు," అని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవిచాయ్ అడ్రాయీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ లెబనాన్‌లోని సామాన్య ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆయన మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలను గుర్తుచేశారు. దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్ లోని ఒక హాస్పిటల్ కు దగ్గరలో ఒక బిల్డింగ్ పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో నలుగురు మరణించారు.