టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఇరాన్ సైన్యానికి ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని సైనిక విభాగాలు సీజ్ ఫైర్ ఒప్పందానికి కట్టుబడి వెంటనే కాల్పులు ఆపాలని ఆదేశించారు. అయితే.. ఇది యుద్ధానికి ముగింపు కాదని.. సంఘర్షణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. బలగాలు అప్రమత్తంగా ఉండాలని.. అమెరికా, ఇజ్రాయెల్ తోక జాడిస్తే అదే స్థాయిలో ప్రతిఘటించాలని సూచించారు.
ఈ మేరకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘సైన్యంలోని అన్ని విభాగాలు కాల్పుల విరమణ ఉత్తర్వుకు కట్టుబడి కార్యకలాపాలను నిలిపివేయాలి. కానీ బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. కాల్పుల విరమణను యుద్ధానికి ముగింపుగా భావించరాదు. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే తమ చేతులు ట్రిగ్గర్ పైనే ఉంటాయని గుర్తుంచుకోవాలి’’ అని పేర్కొన్నారు.
కాల్పుల విరమణ ప్రకటన అనంతరం ఇరాన్ సర్వోన్నత జాతీయ భద్రతా మండలి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఇది యుద్ధం ముగింపు కాదని.. ఇప్పటికీ మా చేతులు ట్రిగ్గర్‌పైనే ఉంటాయని పేర్కొంది. శత్రువు చిన్న పొరపాటు చేసినా అదే స్థాయిలో సమాధానం ఇస్తామని హెచ్చరించింది.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు రెండు వారాల పాటు బ్రేక్ పడింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. హార్మూజ్ జల సంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. 2026, ఏప్రిల్ 10న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ బృందాలు యుద్ధాన్ని ముగించేందుకు ప్రత్యక్ష చర్చలు జరపనున్నాయి. అమెరికా ప్రతిపాదించిన 15, ఇరాన్ 10 డిమాండ్లపై చర్చించనున్నారు.
