సినీ ప్రపంచంలో కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులలో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తాయి. దర్శకుడు డెనిస్ విల్లెనూవ్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ 'డ్యూన్: పార్ట్ త్రీ' (Dune 3) విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఈ చిత్రం విడుదల కావడానికి ఇంకా ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ, అప్పుడే టిక్కెట్ల కోసం యుద్ధం మొదలైంది. ముఖ్యంగా లండన్‌లోని ప్రఖ్యాత BFI IMAXలో జరిగిన పరిణామాలు చూస్తుంటే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమనిపిస్తోంది.
నిమిషాల్లో క్లోజ్.. లక్షల్లో ధర!
ట్రేడ్ అనలిస్ట్ లూయిజ్ ఫెర్నాండో నివేదిక ప్రకారం, BFI IMAXలో 70MM స్క్రీనింగ్ టిక్కెట్లు విక్రయానికి ఉంచిన కేవలం 2 నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఒక్కో టిక్కెట్ ధర రూ. 2,600 నుంచి రూ. 3,100 ($31–$37) వరకు ఉన్నా, అవి కూడా నాన్-రిఫండబుల్ అని తెలిసినా ప్రేక్షకులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. విచిత్రం ఏమిటంటే, ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు రీసెల్లర్లు రంగంలోకి దిగారు. eBay వంటి వెబ్‌సైట్లలో ఈ టిక్కెట్లు $100 నుండి ఏకంగా 1500 డాలర్ల వరకు పలుకుతున్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక్కొ టిక్కెట్ ధర సుమారు లక్షకు పైగా పలుకుతుంది. కేవలం ఒక సినిమా టిక్కెట్ కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు ఫ్యాన్స్ సిద్ధపడటం చూస్తుంటే, డెనిస్ విల్లెనూవ్ సృష్టించిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అవెంజర్స్‌తో బిగ్గెస్ట్ క్లాష్!
2026 డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం, మార్వెల్ భారీ ప్రాజెక్ట్ 'అవెంజర్స్: డూమ్స్‌డే' (Avengers: Doomsday) తో తలపడనుంది. సాధారణంగా మార్వెల్ సినిమాలంటే బాక్సాఫీస్ వద్ద ఎదురుండదు, కానీ 'డ్యూన్ 3' ముందస్తు బుకింగ్స్ చూస్తుంటే అవెంజర్స్‌కు గట్టి పోటీ తప్పేలా లేదు. విజువల్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే ఆడియన్స్ అందరూ ఐమాక్స్ ఫార్మాట్ వైపు మొగ్గు చూపుతుండటంతో, ఈ క్లాష్ 2026లోనే అతిపెద్ద సమరంగా మారనుంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా టికెట్ల కోసం భారీ పోటీ నెలకొంది.
►ALSO READ | OTT Review: స్కూల్ టీచర్‌పై గ్యాంగ్ రేప్.. ఓటీటీలోకి ఉత్కంఠరేపే కోర్ట్‌రూమ్ థ్రిల్లర్..
కథలో ఏం ఉండబోతోంది?
ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన నవలల ఆధారంగా రూపొందుతున్న ఈ మూడవ భాగం, 'డ్యూన్ 2' ముగిసిన 12 ఏళ్ల తర్వాత జరిగే కథను చూపిస్తుంది. పాల్ అట్రైడ్స్ (తిమోతీ చాలమెట్) ఇప్పుడు విశ్వానికి చక్రవర్తి. తన పేరు మీద జరుగుతున్న పవిత్ర యుద్ధం (Holy War) వల్ల తలెత్తిన పరిణామాలు, ప్రత్యర్థి రాజ్యాల నుండి ఎదురయ్యే రాజకీయ కుట్రలను పాల్ ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ పార్ట్ త్రీ హైలైట్.
తారాగణం..
ఈ చిత్రంలో తిమోతీ చాలమెట్‌తో పాటు జెండయా, జేసన్ మోమోవా, ఫ్లోరెన్స్ పగ్, రెబెక్కా ఫెర్గూసన్ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ఈసారి కొత్తగా రాబర్ట్ ప్యాటిన్సన్, అన్యా టేలర్-జాయ్ వంటి స్టార్స్ కూడా చేరడంతో అంచనాలు మరింత పెరిగాయి. డెనిస్ విల్లెనూవ్ తన మునుపటి చిత్రాలతో ఐమాక్స్ ఫార్మాట్‌ను ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రపంచానికి చూపించారు. అందుకే ప్రేక్షకులు కేవలం సినిమా చూడటానికి కాకుండా, ఆ గ్రహాంతర ప్రపంచంలో జీవించడానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు. మరి ఈ బాక్సాఫీస్ పోరులో 'డ్యూన్ 3' ఏ స్థాయి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి!
