వికారాబాద్ కుల్కచర్లలో సంచలనం రేపిన వృద్ధురాలి హత్య కేసును అత్యంత వేగంగా ఛేదించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం బంగారు, వెండి నగల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు పోలీసులు. ఈ కేసులో బండవెల్కిచర్లకు చెందిన చిపిరి మంజుల, ఆమె భర్త భీరయ్య, వారి బంధువు అరుణ్ కుమార్ ప్రధాన నిందితులుగా తేల్చారు పోలీసులు .
నిందితులు ముగ్గురు కలిసి పథకం ప్రకారం కొత్తబావి వెంకటమ్మకు మద్యం తాగించి, తిర్మలాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారని... అక్కడ చున్నీతో ఆమె గొంతు నులిమి హత్య చేసి.. ఆమె దగ్గర ఉన్న బంగారు నెక్లెస్, కమ్మలు, వెండి కడియాలు మరియు సెల్ ఫోన్లను దోచుకున్నారని తెలిపారు పోలీసులు. సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని రాళ్ల మధ్య పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని అన్నారు.
►ALSO READ | హైదరాబాద్ జలవిహార్ లో ఆర్వో ప్లాంట్ పేలుడు... ఇద్దరికి తీవ్ర గాయాలు..
అనంతరం దొంగిలించిన నగలను కామునిపల్లి గ్రామంలో దాచిపెట్టారని... మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభించగా.. చీర ముక్క ఆధారంగా కూతురు లక్ష్మి తన తల్లిని గుర్తించిందని తెలిపారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నగలతో పాటు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ మిస్టరీని సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కుల్కచర్ల పోలీసులు చాకచక్యంగా ఛేదించారని... నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని డిఎస్పీ శ్రీనివాసులు స్పష్టం చేశారు.
