వచ్చే నెలలో అమెజాన్ ఉద్యోగులను పీకేయబోతోందా..? 14వేల మంది ఇళ్లకు వెళ్లిపోవాల్సిందేనా

వచ్చే నెలలో అమెజాన్ ఉద్యోగులను పీకేయబోతోందా..? 14వేల మంది ఇళ్లకు వెళ్లిపోవాల్సిందేనా

మెున్నటికి మెున్న ఒరాకిల్ ఒక్కరోజే 30వేల మంది ఉద్యోగులను తొలగించిన షాప్ నుంచి టెక్ ప్రపంచం ఇంకా కోలుకోలేదు. ఇండియాలోనే ఆ సంస్థ 12వేల మందికి ఇళ్లకు పంపిందనే వార్త మరువక మునుపే అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్ స్టార్ట్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వార్తలపై అమెజాన్ కంపెనీ ఎట్టకేలకు స్పందించింది.

మే 2026 నాటికి మరో 14వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నారనే వార్తలను అమెజాన్ అధికారికంగా ఖండించింది. అందులో వాస్తవం లేదంటూ తోసిపుచ్చింది. ఆసియా బిజినెస్ అవుట్‌లుక్ రిపోర్ట్ ఆధారంగా పుట్టుకొచ్చిన ఈ ప్రచారం కేవలం పుకారు మాత్రమేనని.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అమెజాన్ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న టెక్కీలకు కాస్త ఊరట లభించినట్లయిందని చెప్పాలి.

అమెజాన్‌లో లేఆఫ్స్ అనేది కొత్తేమీ కాదు. 2026 జనవరిలోనూ ఈ టెక్ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా సుమారు 16వేల మంది ఉద్యోగులను తొలగించేసింది. కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే అమెజాన్ మొత్తం 27వేల మందికి పైగా సిబ్బందిని తగ్గించుకుంది ప్రపంచ వ్యాప్తంగా. సంస్థలో మేనేజ్‌మెంట్ లేయర్స్ తగ్గించి.. నిర్ణయాల ప్రక్రియను వేగవంతం చేయడమే లేఆఫ్స్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి గతంలోనే వివరించారు. సంస్థను మరింత స్ట్రీమ్ లైన్ చేసే క్రమంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని ఆమె పేర్కొన్నారు.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అమెజాన్ అండగా నిలవటమే. బాధితులకు 90 రోజుల పాటు అంతర్గతంగా ఇతర డిపార్ట్మెంట్లలో ఉద్యోగాల కోసం వెతుక్కునే అవకాశం కల్పించడంతో పాటు.. సెవెరెన్స్ ప్యాకేజీలు, హెల్త్‌కేర్ బెనిఫిట్స్, అవుట్‌ప్లేస్‌మెంట్ సహాయాన్ని కూడా అందిస్తోందట. కంపెనీలో ఒకవైపు లేఆఫ్స్ జరుగుతున్నప్పటికీ.. వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న విభాగాల్లో నియామకాలు మాత్రం కొనసాగుతాయని అమెజాన్ స్పష్టం చేసింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెజాన్ పేర్కొంటూ తన బిజినెస్ స్ట్రాటజీలను సిద్ధం చేసుకుంటోంది. మార్పులకు అనుగుణంగా మారుతున్న టెక్కీలకు మనుగడ కొంత కష్టంగానైనా దొరుకుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ALSO READ : కనకవర్షం కురిపించిన స్టాక్ మార్కెట్..

ప్రస్తుతం టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. పర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ లాంటి వారు "ఏఐ వల్ల జరిగే లేఆఫ్స్ సరైనవే, ఎందుకంటే చాలామంది తమ ఉద్యోగాలను అసహ్యించుకుంటారు" అని చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింత వేడెక్కించాయి. ఏది ఏమైనా, అమెజాన్ తాజాగా ఇచ్చిన వివరణతో 14 వేల మంది ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఆగిపోయింది. కానీ, మారుతున్న టెక్నాలజీ యుగంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందోననే భయం మాత్రం టెక్కీలను వెన్నాడుతూనే ఉంది.