కనకవర్షం కురిపించిన స్టాక్ మార్కెట్.. బుల్స్ జోరుతో ఇన్వెస్టర్ల సంపద రూ.15 లక్షల కోట్లు అప్

కనకవర్షం కురిపించిన స్టాక్ మార్కెట్.. బుల్స్ జోరుతో ఇన్వెస్టర్ల సంపద రూ.15 లక్షల కోట్లు అప్

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో బుధవారం అద్భుతమైన బుల్ రన్ నమోదైంది. గత కొన్ని వారాలుగా యుద్ధ భయంతో వణికిపోయిన దలాల్ స్ట్రీట్.. ఒక్కసారిగా ఉప్పెనలా లాభాల బాట పట్టింది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఇన్వెస్టర్లలో కొత్త ఊపిరి పోసింది. దీంతో మార్కెట్ల క్లోజింగ్ నాటికి సెన్సెక్స్ ఏకంగా 2,946 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 24,000 మార్కును తాకుతూ రికార్డు స్థాయికి చేరువయ్యింది. మార్కెట్ల ఈ ఊపుతో ఇన్వెస్టర్ల సంపద కేవలం ఒక్క రోజులోనే లక్షల కోట్ల రూపాయలు పెరిగింది.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 3.95 శాతం లాభపడి 77,562 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 873 పాయింట్లు పెరిగి 23,997 వద్ద ముగిసింది. మార్కెట్ ప్రారంభం నుంచే బుల్స్ జోరు కొనసాగింది చివరి వరకూ. దాదాపు 3,705 షేర్లు లాభాల్లో ముగియగా.. కేవలం 498 షేర్లు మాత్రమే నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, రియల్టీ రంగాలు మార్కెట్‌ను ముందుండి నడిపించాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 5 ఏళ్లలో లేని విధంగా ఒక్కరోజే 6 శాతం పైగా దూసుకెళ్లి 55,778 పాయింట్లకు చేరడం ట్రేడర్లను ఆశ్చర్యపరిచింది.

ఈ భారీ ర్యాలీ వెనుక 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. మొదటిది.. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన. ఇది గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్‌ను పూర్తిగా మార్చేసింది. రెండోది.. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనం కావడం. బ్రెంట్ క్రూడ్ ఏకంగా 13.24 శాతం తగ్గి 94.80 డాలర్ల వద్దకు చేరడం భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకు పెద్ద ఊరటనిచ్చింది. చివరిగా మూడోది ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయం. రెపో రేటును 5.25 శాతం వద్ద మార్పు లేకుండా ఉంచుతూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని పెంచింది.

ALSO READ : యుద్ధం ఎఫెక్ట్.. షాకిచ్చిన మొబైల్ కంపెనీలు..

మార్కెట్లలో వచ్చిన ఈ ఉప్పెన వల్ల ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. ఈ ఒక్క రోజే ఇన్వెస్టర్ల సొమ్ము దాదాపు రూ.12 లక్షల కోట్ల నుంచి రూ.15 లక్షల కోట్ల వరకు పెరిగి ఉంటుందని అంచనా. ఎల్‌అండ్‌టీ షేర్లు 7 శాతం, ఇండిగో స్టాక్ ఏకంగా 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. రూపాయి విలువ కూడా 50 పైసలు బలపడి 92.56 వద్దకు చేరడం మార్కెట్లకు అదనపు బలాన్ని ఇచ్చింది.

మార్కెట్ మున్ముందు ఎలా ఉండబోతోంది?
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి.. హార్ముజ్ జలసంధి రీఓపెన్ కావడం వల్ల సరఫరా వ్యవస్థ పుంజుకోనుంది. ఇది భారత కంపెనీల ఆదాయ వృద్ధికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియా VIX సూచీ 5 శాతం తగ్గి 19.85 కి పడిపోవడం మార్కెట్లో అనిశ్చితి తగ్గుతోందనడానికి సంకేతం. ప్రస్తుతానికి మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్‌గా ఉన్నందున.. రాబోయే రోజుల్లో నిఫ్టీ 24,000 మార్కును దాటి కొత్త గరిష్ఠాలకు చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఇప్పుడు మ్యూటెడ్ ఫలితాల కంటే స్థిరమైన ఆర్థిక వృద్ధిపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు బుల్స్ జోరు చెబుతోంది.