భారతీయుల్లో 90% మందికి పళ్ల సమస్యలు.. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్లేది మాత్రం కొందరే ! ఎందుకంటే ?

భారతీయుల్లో 90% మందికి పళ్ల సమస్యలు.. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్లేది మాత్రం కొందరే ! ఎందుకంటే ?

మన దేశంలో దంత సమస్యలు చాలా ఎక్కువ. పిప్పి పళ్ళు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, పళ్లు ఊడిపోవడం వంటివి చాలా మందిలో కనిపిస్తుంటాయి. కానీ,  డెంటిస్ట్ దగ్గరికి వెళ్లే వారు మాత్రం చాలా తక్కువ. పంటి నొప్పి భరించలేనంతగా వస్తే తప్ప ఎవరూ  హాస్పిటల్ మెట్లు ఎక్కడం లేదు.

పరిశోధనల ప్రకారం, దాదాపు 100 మందిలో 90 మంది భారతీయులు ఏదో ఒక సమయంలో చిగుళ్ల వ్యాధులతో బాధపడుతున్నారు. మనం ఫిట్‌నెస్, డైటింగ్ గురించి పట్టించుకున్నంతగా నోటి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదనేది నిపుణుల మాట.

ప్రముఖ దంతవైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ప్రజలు డెంటిస్టుల దగ్గరికి  రాకపోవడానికి ముఖ్య కారణాలు ఉన్నాయి. మనకు ఏదైనా  పంటి సమస్య వస్తే అది  ముదిరి, నొప్పి తట్టుకోలేకపోతే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్లడం లేదు.

పంటి సమస్య అంటే కచ్చితంగా నొప్పి ఉండాలి కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ, పళ్ల మీద పాచి పేరుకుపోవడం,  పిప్పి పళ్లు వంటివి మొదట్లో నొప్పిని కలిగించవు. చివరికి అవి  లోపలే ముదిరిపోయి పళ్లు ఊడిపోయేలా చేస్తాయి.

 డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే చికిత్స భయం, ఇంజక్షన్లు లేదా శస్త్రచికిత్సలు అంటరానే ఆందోళన చాలా మందిలో ఉంది.

 నొప్పి చిన్నగా ఉన్నప్పుడే చికిత్స చేయించుకుంటే తక్కువ ఖర్చవుతుంది. కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల అది పెద్ద సమస్యగా మారి, రూట్ కెనాల్ వంటి కాస్ట్లీ చికిత్సలు అవసరమవుతాయి.

ALSO READ : కొలెస్ట్రాల్ రిపోర్ట్ నార్మల్ వచ్చిందని లైట్ తీసుకుంటున్నారా 

ఒక చిన్న పిప్పి పన్నును ముందుగా  పట్టించుకోకపోతే, అది పక్కన ఉన్న పళ్లకు కూడా పాకుతుంది. ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీయవచ్చు. అందుకే ముందే చికిత్స చేస్తే ఖర్చు తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. 

నొప్పి వచ్చే వరకు ఆగకుండా, ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్ష చేయించుకోవడం మంచిది. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం, భోజనం తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. నోటి ఆరోగ్యం అనేది కేవలం పళ్లకే పరిమితం కాదు, అది మన శరీర ఆరోగ్యంలో ఒక భాగం అని గుర్తించుకోవాలి.