
హైదరాబాద్, వెలుగు: ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ద్వారా నియమితులైన కాంట్రాక్ట్ నర్సులు మంగళవారం కోఠిలోని డీఎంఈ ఆఫీస్ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్సెక్రటరీ నరసింహ మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి వరకు టిమ్స్ ద్వారా జీతాలు సక్రమంగా ఇచ్చారని, ఏప్రిల్ నుంచి డీఎంఈ పరిధిలోకి రావడంతో సమస్య మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో డీఎంఈ ఆఫీస్ఎదుట నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం అడిషనల్ డీఎంఈ అనితా గ్రేసీకి వినతిపత్రం అందజేశారు. నాయకులు ఎంఎస్ మూర్తి, పి.వెంకటయ్య, బొడ్డుపల్లి కిషన్, ప్రవీణ కుమారి, సౌందర్య, శాంతి, స్వప్న, సువర్ణ, రేవతి, మేఘమాల పాల్గొన్నారు.