సర్కార్​ దవాఖాన్లలో కాంట్రాక్టు పోస్టులు

సర్కార్​ దవాఖాన్లలో కాంట్రాక్టు పోస్టులు

హైదరాబాద్, వెలుగు:సర్కార్​ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి  కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కనీసం 2 వేల స్టాఫ్‌‌‌‌ నర్సు పోస్టులు, మరో వెయ్యి పారామెడికల్, ఇతర పోస్టులను ఈ పద్ధతిలో భర్తీ చేయాలని యోచిస్తోంది. దీని కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ సూచించారు. ప్రస్తుతం దవాఖాన్లలో స్టాఫ్‌‌‌‌ నర్సులు, డాక్టర్లు, పారామెడికల్‌‌‌‌, క్లాస్​–4 ఉద్యోగుల కొరత విపరీతంగా ఉంది. ముఖ్యంగా సరిపడా నర్సులు లేకపోవడంతో, ప్రస్తుతం పనిచేస్తున్నవారిపై తీవ్ర పని ఒత్తిడి పడుతోంది. మరోవైపు, సర్కారు దవాఖాన్లకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. దీంతో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వంపై డాక్టర్ల సంఘాల నుంచి ఒత్తిడి వస్తోంది.

2017–18లో సుమారు 4 వేల పోస్టుల భర్తీకి టీఎస్‌‌‌‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో స్టాఫ్‌‌‌‌నర్సు, ఫార్మసిస్ట్‌‌‌‌, ల్యాబ్‌‌‌‌ టెక్నీషియన్ సహా పలు పారామెడికల్‌‌‌‌ పోస్టులున్నాయి. ఈ నియామకాలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో, భర్తీ ప్రక్రియ రెండేండ్ల నుంచి సాగుతూనే ఉంది. ఆ ప్రక్రియ పూర్తవుతుందో, రద్దవుతుందో కూడా ఇప్పటికీ స్పష్టతలేదు. రెగ్యులర్​ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే వరకూ చాలా టైం పట్టే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దవాఖాన్లను తాత్కాలిక ఉద్యోగులతో నింపాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ఈ అంశంపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల ఇటీవల సుదీర్ఘంగా చర్చించారు. ఖాళీల భర్తీ ఆవశ్యకతను ఆయనకు అధికారులు వివరించారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీకి ఉన్న అడ్డంకులు, జీతాల భారం తదితర సమస్యలను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

రూ. 12 వేల జీతం!

ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి ‘మెడికల్, హెల్త్‌‌‌‌ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు’ ఏర్పాటు చేస్తూ 2018 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే, ఇంతవరకూ ఈ జీవో అమలుకు నోచుకోలేదు. ఈ బోర్డును క్రియాశీలం చేసి, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌ ఇటీవల ప్రకటించారు. ఈ బోర్డు ద్వారానే నోటిఫికేషన్‌‌‌‌ ఇచ్చి ఐదార్నెల్లలో భర్తీ పూర్తిజేయాలని భావిస్తున్నారు. తక్కువ కాల పరిమితితో ఒప్పంద ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నారు. అలాగే, ఆర్థికభారం పడకుండా కేవలం నెలకు  రూ. 1‌‌‌‌‌‌‌‌0 వేల నుంచి 12 వేల జీతమే ఇవ్వాలని, ఇందుకు ఒప్పుకున్న వాళ్లనే ఉద్యోగంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే దవాఖాన్లలో వేల సంఖ్యలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌‌‌‌ ఉద్యోగులు ఉన్నారు. కొత్త నియామకాలతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.