రైతు కొంటే బస్తాకు రూ.80.. వ్యాపారి కట్టిచ్చేది రూ. 30

రైతు కొంటే బస్తాకు రూ.80.. వ్యాపారి కట్టిచ్చేది రూ. 30

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ ఏనుమాముల మార్కెట్‍లో వ్యాపారులు రైతులను అరిగోస పెడుతున్నారు. పంటను మార్కెట్​కు తీసుకురాగానే సిండికేటుగా మారి రైతులను నిలువుదోపిడికి  గురి చేస్తున్నారు.   గన్నీ బ్యాగుల రేటు విషయంలోనూ  వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. రైతులకు ఒక సంచీ రూ. 60 నుంచి రూ.80 వరకు అమ్ముతూ.. పంట నింపుకొచ్చాక అదే సంచికి రూ. 30 లే ఇస్తున్నారు.   ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే కాంటాలు, కొనుగోళ్లు  ఆపేసి,  మార్కెట్​ బంద్​ చేసి జులుం ప్రదర్శిస్తున్నారు. గన్నీ బ్యాగుల లొల్లి ఏటా  అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా సమస్య పరిష్కరించడంలో ఫెయిల్​ అవుతున్నారు. జిల్లా  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు  వ్యాపారులు, ఆఫీసర్లతో చర్చించి శాశ్వత పరిష్కారం చూస్తానని  హామీ ఇచ్చినా అమలు కాలేదు.   

అదనంగా 100 గ్రాముల  తరుగు 

గన్నీ బ్యాగు బరువు  సుమారు 700 నుంచి 800 గ్రాములు ఉంటుంది. కానీ వ్యాపారులు రైతులు తెచ్చిన మిర్చిని కాంటా వేసినప్పుడు  బస్తా బరువు పేర   1కిలో  తరుగు తీస్తున్నారు.   మంగళవారం నాడు  తరుగును 1,100 గ్రాములకు పెంచాలని వ్యాపారులు పేచీ పెట్టగా..  రైతులు వ్యతిరేకించారు. ఇప్పటికే రకరకాల పేర్లతో తమను నిలువు దోపిడీ చేస్తున్నారని, అదనంగా 100 గ్రాముల మిర్చి  కోత పెడతామంటే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.  అసలే పంటలకు తగిన రేటు రాక నష్టపోతున్న రైతులను పత్తి, మిర్చి సీజన్‍ లలో  వ్యాపారులు  ఏదో ఒక కొర్రీ పెట్టి  దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.  

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో పంచాయితీ 

గన్నీ బ్యాగుల విషయంలో రైతులకు అన్యాయం చేయకుండా  ఒక్కో బ్యాగ్​కు  రూ.30 చెల్లించాలని అధికారులు గతంలో వ్యాపారులకు తేల్చిచెప్పారు. ఈ రేటు ఇచ్చేందుకు అంగీకరించకుండా  ఛాంబర్‍ ఆఫ్‍ కామర్స్​ ఆధ్వర్యంలో పలుసార్లు  కాంటాలు బంద్‍ చేశారు. చిరిగిన,   అతుకుల సంచులు తీసుకొచ్చి రూ.30 ఇవ్వమంటే ఇవ్వలేమని వారు వాదిస్తున్నారు.  గతంలో వ్యాపారులు మార్కెట్‍ బంద్‍కు పిలుపునివ్వడంతో  అడిషనల్‍ కలెక్టర్‍ శ్రీవత్స అధికారులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనూ  సమస్య కొలిక్కి రాలేదు.  అప్పటికే మార్కెట్​కు సరుకు తరలించిన రైతులు మార్కెట్​లో పడిగాపులు కాశారు.  రైతుల ఇబ్బంది తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు నవంబర్‍ 21న కలెక్టర్‍, ఛాంబర్‍ ఆఫ్ కామర్స్​ ప్రతినిధులు, మార్కెట్‍ అధికారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులు, ఆఫీసర్ల వాదనలు విన్నారు.  ఈ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పి  ఇద్దరు అధికారులతో   ఓ కమిటీ వేశారు.  ఇతర ప్రాంతాల్లో  గన్నీ బ్యాగుల విక్రయం, కొనుగోలు విధానం గురించి తెలుసుకుని వారంలోగా రిపోర్ట్​ ఇవ్వాలని, దాని  ఆధారంగా  రేటు ఫిక్స్​  చేద్దామని చెప్పారు.  3 నెలలు గడిచినా మంత్రి పరిష్కారం చూపలేకపోయారు.  మంగళవారం గన్నీ బ్యాగుల బరువు విషయంలో కొత్త కిరికిరి తేవడంతో మంత్రి మరోసారి  జోక్యం చేసుకుని త్వరలోనే సమస్యకు పరిష్కారం కనుగొంటామని సముదాయించారు.  మూడు నెలల పాటు ఏనుమాముల మార్కెట్‍కు మిర్చి పంట భారీగా వస్తుంది.   ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుతున్నారు. 

సగం రేటు కూడా ఇస్తలేరు

ఉమ్మడి వరంగల్‍తో పాటు చుట్టుపక్కల జిల్లాల రైతులు పంటల  సీజన్‍లో   వ్యాపారుల దగ్గర  గన్నీ బ్యాగులను కొంటారు. తమ సరుకును ఈ బ్యాగుల్లోనే మార్కెట్ కు తరలిస్తారు.   ఒక్కో సంచికి రూ.60 నుంచి రూ.80 వరకు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు.  పంటలు అమ్మినప్పుడు  అవే బ్యాగులకు సగం రేటు కూడా కట్టి ఇవ్వడంలేదు. ఒక్కోసారి బస్తాకు రూ.15 మాత్రమే ధర కడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.   ఎవరైనా గట్టిగా అడిగితే మార్కెట్ బంద్​ చేస్తామని బెదిరిస్తున్నారు. ​ 

వ్యవసాయం చేసుడు దండగే 

నేను పెదవంగర నుంచి పంట తీసుకుని   అర్ధరాత్రి బయలుదేరిన.  గన్నీ బ్యాగుకు  రూ.30 ఇవ్వరంట. కానీ మేం తీసుకొచ్చిన సంచికి తరుగు పేరుతో 1100 గ్రాములు కట్‍ చేసుకుంటారంట. ఇప్పటికే దిగుబడి సరిగా రాక బాధ పడ్తున్నం.  ఇట్లయితే వ్యవపాయం చేసుడు  దండగే. 
- సాయిని సోమయ్య, పెద్ద వంగర

కాంటాలు బంద్‍ చేస్తున్రు 

ఈసారి కాలం కలిసిరాక పంట చేతికిరాలే. మిర్చి ఆరు బస్తాలే ఎళ్లింది. అంత దూరం నుంచి ఆటో ఛార్జీలు పెట్టుకుని తీసుకొస్తే   కాంటాలు బంద్‍ చేసిన్రు. ఇందేందని  అడిగితే  ఎవరూ పట్టించుకుంటలేరు. వ్యాపారులు, దళారులు ఒక్కటయిన్రు. ఆఫీసర్లు వారిని ఏమంటలేరు. 
- జిల్లా ఉపేందర్‍, కొడకండ్ల మండలం